తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు దళ కమాండర్ లొంగిపోయినట్లు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు.
కొత్తగూడెం :తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు దళ కమాండర్ లొంగిపోయినట్లు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు. స్థానిక ఓఎస్డీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం టేకులూరు గ్రామానికి చెందిన శ్యామల ధర్మయ్య ఆలియాస్ ధర్మన్న(38) 2010వ సంవత్సరంలో మావోయిస్టు పార్టీ జాతీయ నాయకుడు సుఖ్‌దేవ్ ఆధ్వర్యంలో దళంలో చేరాడు. తొలుత దళ సభ్యుడిగా పనిచేసిన ధర్మన్న 2012 నుంచి 2013 వరకు సుఖ్‌దేవ్కు గన్‌మెన్‌గా వ్యవహరించాడు. 2014లో శబరి ఏరియా కమిటీ దళ సభ్యుడిగా పనిచేశాడు. 2014 జూన్ నుంచి 2015 జనవరి వరకు డిప్యూటీ దళ కమాండర్‌గా కొనసాగాడు. 2015 జనవరిలో చర్ల దళ కమాండర్‌గా నియమితుడయ్యాడు. చర్ల మండలం ఉయ్యాలమడుగు గ్రామంతోపాటు సమీపంలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని టేకులూరు గ్రామంలో మావోయిస్టు దళంలో చురుగ్గా పనిచేశాడు. ధర్మన్న కంచర్ల, కూరపల్లి, సింగం గ్రామాల్లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లను పేల్చివేసిన ఘటనల్లో పాల్గొన్నాడు.