ఎస్పీ సమక్షంలో లొంగిపోయిన సుందరమ్మ
శ్రీకాకుళం సిటీ: జిల్లాకు చెందిన ఓ మహిళా మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం) ఇరోతు సుందరమ్మ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమెపై ఉన్న రివా ర్డును ఎస్పీ ఆమెకే అందజేశారు.
కుటుంబ నేపథ్యం..
ఇరోతు సుందరమ్మ వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు అప్పన్న(లేటు), గున్నమ్మల కుమార్తె. సుందరమ్మ సోదరులు ఈశ్వరరావు, జానకిరావులు అప్పటికే ఎప్పటి నుంచో మా వోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. వీరి ద్వారా ఉద్యమానికి ఆకర్షితురాలైన సుందరమ్మ 2002లో గార వల్లభరావు అలియాస్ చిన్నమురళి, జానకి అలియాస్ అప్పలనాయుడు, వెంకటరావు అలియాస్ త్రినాథ్, శశిల ప్రోద్బ లంతో మావోయిస్టు పార్టీలో చేరారు.
చిన్న స్థాయి నుంచి..
మావోయిస్టు పార్టీలో దళం మెంబర్ స్థాయి నుంచి ఏసీఎం స్థాయికి సుందరమ్మ ఎదిగారు. తొలుత ఈమె విజయనగరం జిల్లా కొండబారిడి ఏరియాలో దళం మెంబరుగా పనిచేశారు. అలాగే గొట్టా ఏరియాలో, దేరువాడ ఏరియాలో పనిచేస్తూ తర్వాత ఒడిశాలోని ఆర్ ఉదయగిరి దాడిలో మెడికల్ బృందంలో దళం సభ్యులకు ప్రథమ చికిత్స చేసేందుకు నియమితులయ్యారు. 2006లో కొరాపుట్ ఏసీఎంగా ప్రమోట్ అయ్యారు. 2008 నుంచి 2009 వరకు జంఝావతి దళ కమాండర్‌గా పనిచేశారు. 2012లో హైకమాండ్ ఆదేశాల మేరకు దండకారణ్యంలో 8 నెలల మెడికల్ ట్రైనింగ్ కోసం వెళ్లారు. ఆమె దళంలో పనిచేసినప్పుడు 303 తుపాకీ ఉపయోగించారు.
బయటకు వచ్చి.. మళ్లీ
కొంతకాలం కిందట సైద్ధాంతిక విభేదాల కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే హైకమాండ్ ఆదేశాలతో మళ్లీ పార్టీలోకి చేరారు. అయినా అక్కడి పరిస్థితులకు తలొగ్గలేక జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అన్నయ్య ఇరోతు ఈశ్వరరావును వెంటపెట్టుకుని ఎస్పీ సమక్షంలో ఆదివారం లొంగిపోయారు.
ఈమె పాల్గొన్న సంఘటనలు:
- దమన్‌జోడీ ఎన్‌ఏఎల్‌సీఓ కంపెనీపై దాడిలో పాల్గొన్నారు.
- ఒడిశాలోని నారాయణపట్నం బ్లాక్‌లో పాలూరు అంబూష్‌లో పాల్గొని నలుగురు సీఆర్‌పీఎఫ్ జవా నుల మృతికి కారణమయ్యారు.
- దాయిగూడ అంబూష్ మెట్టకమరవలస దాడిలో పాల్గొన్నారు.
- కేడవాయి, చిన్నదొడ్డ, జరుడ తదితర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన రివార్డును అందజేస్తాం: ఎస్పీ
ఇరోతు సుందరమ్మ మీద ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డు నగదును ప్రభుత్వం నుంచి ఈమెకు ఇప్పించే ఏర్పాటు చేస్తూ, మిగిలిన రాయితీలు కలెక్టర్ నుంచి ఇప్పించే ఏర్పాట్లను చేస్తానని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ హామీ ఇచ్చారు. ఈమె మాది రిగానే ఇంకా ఎవరైనా మాజీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే వారి రివార్డు, నగదును వారి జీవన ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. మిగిలిన మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment