భవాని, అనూష, అన్నపూర్ణ (ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో చాలా ఏళ్ల తర్వాత ‘మావోయిస్టు’ జాడలు కలకలం రేపుతున్నాయి. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న మావోయిస్టు సంబంధాల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. కొన్నేళ్లుగా తెలంగాణలో నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలేవీ లేనప్పటికీ.. నగర శివార్లను షెల్టర్ జోన్‌గా ఉపయోగిస్తూ దేశంలో వివిధ ప్రాంతాల్లో హింసకు కుట్ర పన్నుతున్నారన్న కారణాలతో ఎన్జీఆర్‌ఐలో పనిచేస్తున్న నక్కా వెంకట్రావుతో పాటు మౌలాలీ హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న ఆత్మకూరి భవాని, అన్నపూర్ణ, అనూషలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మౌలాలీ హౌసింగ్ బోర్డులో ఉంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్, కుల నిర్మూలన సమితిలో పనిచేస్తున్న ఆత్మకూరి రమణయ్య దంపతుల కూతుళ్లు భవాని (అమవీరుల బంధుమిత్రుల కమిటీ), అన్నపూర్ణ (చైతన్య మహిళా సంఘం), అనూష(చైతన్య మహిళా సంఘం) ఆయా సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వీరిలో అనూష 2017 డిసెంబర్ నుంచి విశాఖ ‘మావో’ దళసభ్యురాలిగా నియమితమై పలుమార్లు ప్రాంతాల్లో కాల్పులతో పాటు, మందుపాతరలను పేల్చిన ఘటనల్లో పాల్గొన్నట్లు విశాఖ పోలీసులు అభియోగం మోపారు. చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్న అన్నపూర్ణ గాలికొండ దళంతో టచ్‌లో ఉన్నారని, భవాని తెలంగాణ, ఏపీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ జాయింట్ సెక్రటరీగా పలు విధ్వంస కార్యక్రమాలకు రెక్కీ నిర్వహించారన్నది అభియోగం. ఇదిలా ఉంటే భవాని, అన్నపూర్ణలు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. ఏపీ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోకు చిక్కిన మావోయిస్టు కామేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు అనూష ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులకు చిక్కారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు అక్కలను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగర శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటూ వివిధ సంఘాల పేరుతో పనిచేస్తున్న విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలపై మరింత నిఘా పెంచే యోచనలో నగర పోలీసులు ఉన్నారు. నగరంలో విధ్వంసకర కార్యకలాపాలేవీ చేయకున్నా నిషేధిత సంస్థల ప్రతినిధులు నగరాన్ని షెల్డర్ జోన్‌గా వాడుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
హక్కుల సంఘాల ఖండన
పౌర హక్కులను, ప్రజా సంఘాలను అణిచివేసే క్రమంలోనే విప్లవ రచయిత వరవరావు మొదలుకుని, నక్కా వెంకట్రావు, తాజాగా మౌలాలిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారని పౌరహక్కుల సంఘం పేర్కొంది. ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దారుణమని అరెస్ట్ అయినవారి తండ్రి ఆత్మకూరి రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment