సాక్షి, సిటీబ్యూరో :గ్రేటర్ హైదరాబాద్‌లో వివాహాలు జోరందుకున్నాయి. నగరంలో ఒక్క ఆదివారమే వేల సంఖ్యలోనే పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. వీటి కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. భారీగా ఖర్చుపెట్టి పెళ్లి చేసుకుంటున్న వారు రూ.200 వెచ్చించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పెద్దగా ఆసక్తికనబరచడంలేదు. వాస్తవంగా వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సమస్యలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. దాంపత్య బంధానికి మరింత బలం చేకూరనుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది.
ప్రయోజనాలు ఇలా..
♦ విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల్లో వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు
♦ రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు ఉపయుక్తం
♦ ప్రేమ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు
♦ వరకట్నం, శారీరక, మానసిక వేధింపులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకునే వీలు
♦ వీసా, పాస్‌పోర్టు, ఇంటిపేరు మార్పు వంటి వాటికి తప్పనిసరిగా వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం పొందుపర్చాలి
♦ ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకాలు పొందే వీలు
♦ భాగస్వామి మరణించిన సందర్భంలో ప్రభుత్వ నుంచి ప్రయోజనాలు పొందవచ్చు
♦ ఆస్తుల వ్యవహారంలో లీగల్ హైర్ సర్టిఫికెట్ పొందేందుకు ఉపయోగపడుతుంది
♦ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా వివాహరిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం పొందుపర్చాల్సి ఉంటుంది
♦ దివ్యాంగులకు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ పారితోషికంఅందాలంటే వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
గృహహింస, వరకట్న వేధింపులు, చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది దంపతులు విడిపోతున్నారు. దీంతో వారి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ప్రేమ వివాహాలు, పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నవారి ఇళ్లలో ఈ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివాహ రిజిస్ట్రేషన్ ఒక ఆయుధంగా పని చేస్తుంది. ఈ సమయంలో ఎటువంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెంటనే ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ఇందుకు రూ.200 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చు.
ప్రేమ వివాహాల విషయంలో..
ప్రేమ వివాహం చేసుకున్నవారు సంబంధిత కార్యాలయంలో మూడు దరఖాస్తులనుసమర్పించాలి. ఒక దరఖాస్తు అధికారుల వద్ద, మరో దరఖాస్తు అదే కార్యాలయంలో నోటీసు బోర్డులో ఉంటుంది. మూడో దరఖాస్తును దరఖాస్తుదారుల సొంతూరికి పంపిస్తారు. నెల రోజుల గడువు అనంతరం ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే సాక్షి సంతకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆర్య సమాజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారిచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.నివాస ధ్రువీకరణ పత్రం, వివాహం జరిగినట్లు ఆహ్వాన పత్రిక, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షుల డిక్లరేషన్, వధూవరుల డిక్లరేషన్, ఆధార్ కార్డు పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇవీ అర్హతలు..
వధువుకు 18 ఏళ్లు,వరుడికి 21 ఏళ్లు దాటి ఉండాలి వయసు ధ్రువీకరణకు సంబంధించిపదో తరగతి మార్కులు జాబితాపొందుపర్చాలి
Comments
Please login to add a commentAdd a comment