
తరుణ్ తనువు చాలించాడు..
* మాసాయిపేట ఘటనలో మరో విద్యార్థి మృతి
* 17కు చేరుకున్న మాసాయిపేట మృతులు
* మరో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమం
* యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు
* 7గురు విద్యార్థుల డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో తరుణ్ (7) అనే మరో విద్యార్థి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థు ల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే. తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ మృ తి చెందాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు చేసిన యత్నాలు ఫలించలేదని వైద్యులు వెల్లడించారు.
మరో ముగ్గురి పరిస్థితి విషమం
తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6),వరుణ్‌గౌడ్ (7),వైష్ణవి (11) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వైష్ణవి స్థితి మరింత విషమంగా ఉందని డాక్టర్లు తెలి పారు. వీరు కాకుండా మరో ఇద్దరు నితూష (7), శరత్ (6)లకు ప్రాణాపాయం తప్పినప్పటికీ అత్యవసర వైద్య సేవలను అందజేస్తున్నారు. ఈ విషయాలను సికి ంద్రాబాద్ యశోద ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య వెల్లడించారు. చికిత్స పొందుతున్న మొత్తం 20 మందిలో ఏడుగురిని సోమవారం డిశ్చార్జి చేయగా, మరో 7 గురిని రెండు,మూడు రోజుల్లో ఇంటికి పంపనున్నట్లు తెలిపారు. డిశ్చార్జి అయిన పిల్లల కుటుంబీకులు మాత్రం తమకు పూర్తి సంతృప్తి కలిగిన తరువాతనే వెళ్తామని చెప్పడంతో తాము అంగీకరించామని డాక్టర్ లింగయ్య చెప్పారు. యశోద ఆసుపత్రి ‘హోమ్ కేర్ సర్వీసెస్’ బాధితులు ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి అవసరమైన వైద్యసేవలను అందజేస్తుందన్నారు.
డిశ్చార్జి అయింది వీరే : సాయిరామ్ (4), రుచిత గౌడ్ (8), సాత్విక(6), మహిపాల్‌రెడ్డి (4), సద్భావన్‌దాస్ (3), కరుణాకర్ (9),సందీప్ (5)లను డాక్టర్లు వైద్యపరంగా డిశ్చార్జి చేశారు.
కోలుకునే వరకూ వైద్యసేవలు: డిప్యూటీ సీఎం
బస్సు దుర్ఘటనలో చికిత్సలందుకున్న విద్యారులకు డిశ్చార్జ్ అనంతరం కూడా పూర్తిగా కోలుకునేంత వరకు వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. సోమవారం ఆయన ఆస్పత్రిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించారు. డిశ్చార్జ్ అయిన వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కామారెడ్డిలోని ఆర్థోపెడిక్ సర్జన్ పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సందర్శించారు.
చెక్కులు పంపిణీ చేసిన నారా లోకేష్
మాసాయిపేట్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబా బు కుమారుడు లోకేష్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 వేల వంతున 20 మందికి ఆయన అందించారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకునేందుకు వ చ్చే వారికి ట్రస్టు తరఫున ఉచిత విద్యనందిస్తామని హా మీ ఇచ్చారు. మృతి చెందినవారి కుటుంబాలకు ఈ నెల 30న గజ్వేల్‌లో రూ.లక్ష చొప్పున ఇస్తామన్నారు.
మాసాయిపేట ఘటనపై రాష్ట్రపతి సంతాపం
మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు సోమవారం లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయకచర్యలను అందులో ప్రస్తావించారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కూడా పంపారు.
కరిగిన కలలు..
మెదక్ జిల్లా గుండ్రెడ్డిపల్లికి చెందిన శ్రీశైలం, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడైన తరుణ్‌ను ఈ ఏడాదే కాకతీయ స్కూల్లో చేరాడు. పాప వయస్సు ఏడాది. సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకొని బతుకుతోన్న శ్రీశైలం దంపతులు కొడుకును బాగా చదివించాలని కలలు గన్నారు. అవి కల్లలయ్యాయి. కొడుకు మరణవార్త తెలిసి వారు కన్నీటి పర్యంతమయ్యారు.
దర్యాప్తు జరపాలని జనహిత వ్యాజ్యం
మెదక్ జిల్లా మాసాయిపేటలో చిన్నారులను బలి గొన్న రైలు-బస్సు దుర్ఘటనపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీతో విచారణ చేయించాలని హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. నగరానికి చెందిన ఎం.రామ్మోహన్‌రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని రైల్వే క్రాసింగ్ ప్రాంతాల్లో గేట్లను ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షించేందుకు సిబ్బందిని నియమించాలని ఆ పిటిషన్‌లో కోరారు.