స్వాగతానికి భారీ ఏర్పాట్లు
►సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాహుల్
►ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల సన్నాహాలు
►మేడ్చల్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ..కార్యకర్తలతో మాటామంతీ
►యువనేత పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : యువనేత రాహుల్‌గాంధీ పర్యటనను జిల్లా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి తర్వాత తొలిసారి నగరానికి వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసింది. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం రాష్ట్రానికి వస్తున్న రాహుల్ విమానాశ్రయంలో అడుగిడడం మొదలు జిల్లా సరిహద్దు దాటే వరకు వాహనశ్రేణితో ఊరేగింపుగా తరలాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది.
సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే రాహుల్ అక్కడ దాదాపు గంట సేపు గడపనున్నారు. తొలుత రాష్ర్ట నాయకులతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు జిల్లా ప్రతినిధులతో భేటీకానున్నారు. కేంద్ర సర్కారు భూసేకరణ చట్టానికి తీసుకువస్తున్న సవరణలతో రంగారెడ్డి జిల్లాకు జరిగే అన్యాయంపై ఈ సందర్భంగా రాహుల్‌కు వివరించనున్నట్లు కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి తెలిపారు.
యూపీఏ భూసేకరణ చట్టం రైతుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని అమలు చేసిందని, ప్రస్తుతం కార్పొరేట్లకు దన్నుగా నిలిచేలా చట్టానికి సవరణలు చేస్తున్నదని, దీనివల్ల రంగారెడ్డి జిల్లాలోని రైతాంగానికి తీరని అన్యాయం జరగనుందని స్పష్టం చేయనున్నట్లు చెప్పారు. ఫార్మాసిటీ, ఫిలింసిటీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పేర అడ్డగోలుగా జరిగే భూసేకరణ రైతుల జీవనాధారాన్ని దెబ్బతీయనుందనే అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరనున్నట్లు కార్తీక్‌రెడ్డి తెలిపారు.
మేడ్చల్‌లో జెండా ఆవిష్కరణ
శంషాబాద్ నుంచి భారీ వాహనశ్రేణిలో అదిలాబాద్ పర్యటనకు బయలుదేరే రాహుల్‌గాంధీ మార్గమధ్యంలోని మేడ్చల్‌లో కాసేపు ఆగుతారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మేడ్చల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి.. కొద్దిమంది కార్యకర్తలతో ముచ్చటిస్తారని చెప్పారు.
ఇదిలావుండగా, రాహుల్ రాకను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీపీసీసీ నేతలు, మాజీమంత్రులు మూడు రోజులుగా ఆయన పర్యటన సాగే మార్గాల్లో పర్యటించి పార్టీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటుచేసే అంశంపై జిల్లా కమిటీకి పలు సూచనలు చేశారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు భారీగా జనసమీకరణ చేసే బాధ్యతను జిల్లా నేతలకు అప్పగించారు.