సీఎం పేషీలోకి స్మితా సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీలో ఐఏఎస్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు తొలి పోస్టింగ్ లభించింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులవుతున్నా.. ఇప్పటి వరకు పేషీలో ఎవరూ లేరు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నర్సింగ్‌రావును నియమించాలని నిర్ణయించినా.. ఆయన కేంద్ర సర్వీసుల నుంచి ఇంకా రాలేదు. అలాగే మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి, హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న గోపాలరెడ్డి కూడా ఇంకా రిలీవ్ కాలేదు. నాలుగు రోజులుగా కేసీఆర్ తన కార్యాలయానికి రోజూ వస్తున్నా.. ఆయనకు అవసరమైన సమాచారాన్ని బ్రీఫింగ్ చేసే యంత్రాంగం ఏదీ ఇంకా ఏర్పాటు కాలేదు.
ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు మెదక్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
సీసీఎల్‌ఏగా రాజీవ్‌శర్మ: తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.