
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర అడవులు, పర్యావరణ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు. హైదరాబాద్‌లో 188 అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, దీనికోసం అటవీ పునరుజ్జీవన నిధి నిర్వహణ సంస్థ(కంపా) నిధుల్లో కేంద్రం వాటా నుంచి రూ.100 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలన్నారు. కంపా నిధులతో చేపట్టే పనుల్లో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం నిష్పత్తిని 70:30గా మార్చాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును, అటవీ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలను స్వయంగా చూసేందుకు మరోసారి రాష్ట్రంలో పర్యటించాలని హర్షవర్ధన్‌ను కేసీఆర్ కోరారు.దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు.హర్షవర్ధన్‌తో కలసి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యఅధికారులతో సమావేశమయ్యారు. మొక్కల పెంపకం, అడవుల రక్షణ, అటవీ భూభాగంలో అడవి పునరుజ్జీవం, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అడవిని పునరుజ్జీవింపచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, సామాజిక వనాల పెంపుదల కోసం చేపట్టిన కార్యక్రమాలను అటవీశాఖ అధికారులు వివరించారు. దీన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అటవీ రక్షణ కోసం కొత్త చట్టం తేవడానికి కేంద్రం యత్నిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. చెట్ల పెంపకం అవసరంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రమంత్రి సూచించారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతం పెంచేలా హరితహారం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఏటా వంద కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఎక్కడైనా చెట్లు పోతే, అంతే విస్తీర్ణంలో మరోచోట అడవిని పెంచే చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం నిధులు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. ‘అడవిలో దొరికే పూలతో నిర్వహించే బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ’అని కేసీఆర్ చెప్పారు.ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పి.కె.ఝా, సీసీఎఫ్ రఘువీర్, అడిషనల్ పీసీసీఎఫ్ శోభ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణ, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, ఇతర అధికారులతో కలిసి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు.
కలెక్టర్లకు మొక్కల సంరక్షణ బాధ్యతలు...
హరితహారంలో కోట్లాది మొక్కలు నాటుతున్నామని, వాటికి నీరు పోసి పెంచి పెద్ద చేయడంతోపాటు, రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు. ప్రతీ గ్రామంలో ఇందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ఎస్.కె.జోషికి సీఎం కేసీఆర్ చెప్పారు. ఉపాధి హామీ, కాంపా నిధులతోపాటు ఇతర నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రతీ పాఠశాల విద్యార్థులను అడవి సందర్శనకు తీసుకెళ్లాలని చెప్పారు. తద్వారా వారికి అడవులపై అవగాహన, చెట్ల పెంపకంపై ఆసక్తి కలుగుతాయని సీఎం వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment