పేదల పాలిట పెన్నిధి మియామిష్క్‌  | Mia Mashak Dargah Hyderabad | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 7:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Mia Mashak Dargah Hyderabad - Sakshi

శిథిలావస్థలోబాబా డాకిలా ప్రధాన ద్వారం

జియాగూడ : పురానాపూల్‌ వంతెన వద్దగల చారిత్రాత్మకమైన మియామిష్క్‌ మసీదు, దర్గా ఎంతో ఖ్యాతిగాంచింది. నాటి నుంచి నేటికి యాత్రికులకు బస, విద్యార్థులకు గదులు, మదర్సా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. చారిత్రాత్మకమైన మియామిష్క్‌ మసీదు, దర్గాను 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. గోల్కొండను పాలించిన అబ్దుల్లా ఇబ్రహీం కులీకుతుబ్‌షా పాలనలో సైనిక కమాండర్‌గా సేవలందించిన మియామిష్క్‌ నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవాడు.  పాతబస్తీలోని గగన్‌పహాడ్‌ గుట్ట ప్రాంతం నుంచి తెప్పించిన రాయి పురానాపూల్‌ వంతెనకు, మియామిష్క్‌ మసీదు, దర్గాలకు ఉపయోగించా. ప్రస్తుతం మియామిష్క్‌ దర్గా, మసీదు ఆర్కియాలజీ, వక్ఫ్‌ బోర్డు ఆధీనంలో ఉన్నాయి.  

రాతితో మసీదు నిర్మాణం.. 
ఇక్కడి మసీదు నిర్మాణం రాతితో చేపట్టింది. మసీదు చుట్టూ యాత్రికులు, వ్యాపారులు బస చేసేందుకు గదులు నిర్మించారు. అప్పట్లో గోల్కొండ పక్కనే ఉన్న కార్వాన్‌ వ్యాపార కేంద్రానికి వచ్చేవారు మసీదులోని ఈ గదుల్లో బస చేసేవారు.  మసీదులో వ్యాధులను నయం చేసేందుకు ఓ రకమైన మసాజ్‌ చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేడినీళ్లతో హౌజ్‌ను నిర్మించారు. హైదరాబాద్‌ చివరి నిజాం హయాంలో ఉన ప్రధాన కార్యదర్శి కిషన్‌ పర్‌షాద్‌ మహరాజ్‌ ఏదో వ్యాధి నిమ్తితం  ఇక్కడే చికిత్స  పొందాడు.  మసీదు, దర్గాల మినార్లు చార్మినార్‌ నిర్మాణ శైలి డిజైన్‌ను పోలి ఉంటుంది. అలాగే విద్యార్థుల వసతి కోసం సుమారు 35 కు పైగా రెండేసి గదుల ఇండ్లను నిర్మించారు.  అప్పట్లోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇందులో ఉంటూ ఉన్నత చదువులను కొనసాగించే వారు.  ఇక ప్రత్యేకంగా చిన్నారుల కోసం మదర్సాను కూడా  ఏర్పాటు చేశారు. ఇందులో ఖురాన్, అరబ్బీ బాషలను నేర్పించేవారు.  

వరద బాధితులకు సేవలందించిన మసీదు.. 
1908లో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎన్నో ఇళ్లను వరదలు ముంచెత్తగా పల్లపు ప్రాంతంలో ఉన్న మియామిష్క్‌ మసీదు బాధితులకు రక్షణ కల్పించింది. నీటి పరవళ్లు తగ్గే వరకు మియామిష్క్‌ మసీదులో వందలాది మంది ప్రజలు ఆశ్రయం పొందారు. అలాగే వరద బాధితుల కోసం కూడా ఎన్నో సేవలందించిన ఘనత ఈ మసీదుకే దక్కుతుంది.  

పట్టించుకోని అధికారులు.. 
ఎంతో చారిత్రాత్మకమైన మియామిష్క్‌ మసీదు, దర్గా, మదర్సా, వసతి గృహాల అభివృద్ధి కోసం పురావస్తు శాఖ  విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మసీదు పరిసర కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పలుచోట్ల మసీదు కట్టడాలు పెళ్లలు, పెచ్చులూడాయి.  

ఎంపీ నిధులతో మరమ్మతు పనులు..
ప్రభుత్వం మసీదు పరిరక్షణకు ఎలాంటి నిధులు, రక్షణ, భద్రత కల్పించక పోయినా ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ  ప్రత్యేకంగా రూ.10 లక్షలు మంజూరు చేయడంతో చిన్నపాటి మరమ్మతులు చేపడుతున్నాం. అలాగే మైనార్టీ వెల్ఫేర్‌ ద్వారా బాబా డాకిలా ప్రధాన ద్వారాం అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.20 లక్షలు  నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఆ పనులు కూడా చేపడతాం.
  –  సమద్‌ వార్సి, మియామిష్క్‌ మసీదు అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement