సాక్షి, హైదరాబాద్: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేయడం సరైంది కాదని, ఆయన ముందు తాను ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాను ప్రమాణం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన వాట్సాప్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఏముందంటే...! ‘ప్రొటెం స్పీకర్‌గా ఒక ఎంఐఎం ఎమ్మెల్యేను పెడుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ ప్రమాణ స్వీకారం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పార్టీకి ఓటేశారో, ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారో ఇప్పుడు ప్రజలు గమనించాలి. రానున్న కాలంలో ఇంకా ఏం జరుగుతుందో మీరే చూస్తారు.
ఈనెల 17న అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, ఆయన ముందు నేను ప్రమాణ స్వీకారం చేయను. నేను అసెంబ్లీకే పోను. లీగల్‌గా ఏమవుతుందో చూసుకుంటా. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉన్న పార్టీ, దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులను చంపేస్తా అని చెప్పిన ఎమ్మెల్యేలున్న పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ చేయడం సిగ్గుచేటు. నేనయితే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తుల ముందు ప్రమాణం చేయను. ఏకపక్షంగా మీరు గెలిచారు. ఎలాంటి వ్యక్తులను ముందుకు తీసుకెళ్లాలో, ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలో సీఎం ఆలోచించాలి. తెలంగాణలో హిందువులు, ముస్లింలను కలుపుకుని వెళ్లాలి. కానీ, దేశం పట్ల, హిందూ ధర్మం పట్ల వారి విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. సీఎం నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి’అని వాట్సాప్ వీడియోలో రాజాసింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment