సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం వివిధ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేర పెరగలేదు. జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కు రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ ఏడాది జనవరిలో సమర్పించిన సాగు వ్యయాల ప్రకారం క్వింటా వరి పండించాలంటే రైతుకు రూ. 2,529 ఖర్చవుతోంది. ఇందుకు తగిన విధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి క్వింటాకు రూ. 3,794 మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ కోరింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వరి, మొక్కజొన్నలకు క్వింటాకు కనీసం రూ. 2 వేలపైనే మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. కానీ వాటి ఎంఎస్‌పీ అంత మొత్తంలో పెరగలేదు. అలాగే పత్తి లాంగ్ స్టాపిల్‌కు క్వింటా పండించేందుకు రూ. 10,043, క్వింటా కంది పండించేందుకు రూ. 8,084 చొప్పున ఖర్చవుతోందని, వాటికి 50 శాతం అదనంగా ఎంఎస్‌పీ ఇస్తేనే రైతుకు సాగు లాభసాటిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అయినా కేంద్రం ఆ మేరకు పెంచలేదు.
పెరుగుదల 10 శాతం లోపే..
కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల పెంపు అన్ని పంటలకు 10 శాతం లోపే ఉంది. ఇంత తక్కువ పెంచి రైతులకు ప్రతి పంటకు 50 శాతం ఎక్కువ ఆదాయం తిరిగి వస్తుందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యం? కనీస మద్దతు ధరలను రాష్ట్రాలవారీగా, స్థానిక ఉత్పత్తి ఖర్చు మేరకు నిర్ధారించాలి. కనీస మద్దతు ధరల్లో చూపే పంట ఖర్చుకు, బ్యాంకులు తయారు చేసుకొనే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మధ్య భారీ తేడా ఉంది.
– నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment