‘ఇప్పటికి  అద్దె  బస్సులే’ | Minister Puvvada Ajay Kumar Interview With Sakshi                  | Sakshi
Sakshi News home page

‘ఇప్పటికి  అద్దె  బస్సులే’

Published Fri, Sep 13 2019 3:14 AM | Last Updated on Fri, Sep 13 2019 4:38 AM

Minister Puvvada Ajay Kumar Interview With Sakshi                 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దానికి వెంటనే కాయకల్ప చికిత్స అవసరం. ఈ దిశగా నా ప్రయత్నం మొదలైంది. నాలుగేళ్లుగా బస్‌ చార్జీలు పెంచలేదు. దీంతో టికెట్‌ రూపంలో వచ్చే ఆదాయంలో పెరుగుదల లేదు. కొన్నేళ్లుగా డీజిల్‌ ధర విపరీతంగా పెరిగింది. ఆ రూపంలో ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇక గతంలో కార్మికుల సంక్షేమం కోసం ఉదారంగా వేతన సవరణ చేయటం వల్ల స్వతహాగా పడ్డ భారం కూడా తోడైంది. దీంతో కొంత కాలంగా ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తోంది. పరిస్థితి చక్కదిద్దేందుకు త్వరలోనే చర్యలు ప్రారంభమవుతాయి. శాసనసభ సమావేశాలు ముగియగానే వీలు చూసుకుని సీఎం కేసీఆర్‌తో చర్చించి తరుణోపాయంతో ముందుకు సాగుతాం’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

సమ్మె లేకుండా చర్యలు.. 
కొద్దిరోజులుగా ఆర్టీసీ కారి్మక సంఘాలు సమ్మె నోటీసు ఇస్తున్నాయి. సంఘాల డిమాండ్లు సం ఘాలకున్నాయి. కానీ సమ్మె చేయడం సంస్థకు క్షేమం కాదు. అందుకే సమ్మెకు వెళ్లకుండా చూసే ప్రయత్నంలో ఉన్నాను. ఆ సంఘాల డిమాండ్లను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించి నిర్ణయం తీసుకుంటాను. 

ప్రస్తుతానికి అద్దె బస్సులే... 
ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పటికిప్పుడు భారీ వ్యయంతో బస్సులు కొనే పరిస్థితి లేదు. అందుకే అద్దె బస్సులు వీలైనన్ని తీసుకోవాలనుకుంటున్నాం. దాదాపు 800 గ్రామాలకు బస్సు వసతి లేదు. వీటికి అద్దె బస్సులను తీసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో కారి్మక సంఘాలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీ తక్షణావసరాలకు రూ.700 కోట్ల వరకు రుణం తీసుకునే ఆలోచన ఉంది. వాటితో కొన్ని కొత్త బస్సు లు కొనే వీలు కూడా ఉంటుంది.  

సిటీలోనే ఎక్కువ నష్టాలు... 
కేంద్రం మంజూరు చేసిన 325 బ్యాటరీ బస్సుల్లో ఎక్కువ మొత్తం సిటీలో తిప్పుతాము. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు కొంతమేర మెరుగైన రవాణా వసతి ఉంటుంది. ఆరీ్టసీ కి సిటీలోనే ఎక్కువ నష్టాలొస్తున్నాయి. ఆరీ్టసీకి రాష్ట్రంలో రూ.50 వేల కోట్ల విలువైన భూములున్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు వీలుగా పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టులు చేపడితే సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతుంది. గతంలో ఈ దిశగా యత్నం జరిగినా, అది విజయవంతం కాలేదు. ఇప్పుడు ఆ ఆలోచనను పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకుంటాను. వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల వేలం ప్రక్రియను ఆన్‌లైన్‌లో ఈ– బిడ్డింగ్‌ ద్వారా నిర్వహించమని చెప్పాను. 

క్లౌడ్‌ మెమోరీలో స్పేస్‌ తీసుంటాం... 
రవాణాశాఖలో సేవలు ఆన్‌లైన్‌లో ఉండటంతో వాహనదారులు సంబంధిత యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వాహనం డాక్యుమెంట్లన్నీ ఆ యాప్‌ సాయంతో స్టోర్‌ చేసుకుంటున్నారు. దీంతో రవాణాశాఖ సర్వర్‌ సామర్థ్యం సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొత్తగా మరో సర్వర్‌ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కానీ కొత్త సర్వర్‌ బదులు క్లౌడ్‌ మెమోరీలో కావాల్సినంత స్పేస్‌ కొనమని ఆదేశించాను. కనీసం వచ్చే 15 ఏళ్లకు సరిపడేలా ఈ స్పేస్‌ ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement