
సాక్షి, మహబూబ్‌నగర్: పేదవాడి సొంతింటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేట్‌లో శనివారం రోజున ప్రభుత్వం నిర్మించిన 650 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ.. వీరన్నపేటలో 650 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాము. వీరన్న పేట్‌లో ఇళ్లు లేని వంద శాతం మంది ఎస్సీలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇస్తున్నాం. మైనారిటీలకు 12శాతం ఇస్తున్నాం. వీటికి దగ్గర్లోనే పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం చేపడతాం. డబుల్ బెడ్‌రూంలకు సంబంధించి దళారులను నమ్మొద్దు. ఈ నెల 13న మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ఈ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.


