
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో పంటలకు మంచి మద్దతు ధర అందించేందుకు, లాభసాటి వ్యవసాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, దాన్ని నియంతృత్వ వ్యవసాయం అంటూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. పంటలు కొనలేని పరిస్థితి వస్తే తెలంగాణలో రైతుకు నష్టం రాకుండా ఉండేందుకే నియంత్రిక వ్యవసాయమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే గిట్టుబాటు వస్తుందన్నారు. పసుపు పంటలో అంతరపంటగా మొక్కజొన్న వేసుకోవచ్చని, వర్షాకాలంలో మొక్కజొన్న వేయవద్దని చెప్పారు. కరోనా వల్ల పసుపు మార్కెట్ మూసివేసినందున ముఖ్యమంత్రిని కోరితే ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు.
2,3 రోజుల్లోనే నిజామాబాద్ మార్కెట్ ప్రారంభిస్తామని, రైతులు పసుపు అమ్మకాలు చేసుకోవచ్చునని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కరోనా కట్టడిలోనే ఉందని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా 80 శాతం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ 500 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment