నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా..
నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా..
Published Sun, May 28 2017 7:09 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
► పోలీసులకు మొరపెట్టుకున్న బాలిక
మహబూబ్ నగర్: జిల్లాలోని ఓ బాలికకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మకు వచ్చినంత కష్టం వచ్చింది. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా బాల్యవివాహాల ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఇంతకంటే దారుణం మరోకటి లేదు. తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనకు పెళ్లి వద్దని, ఈ పెళ్లిని ఆపాలని ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. మహబూబ్‌నగర్‌జిల్లా బాలానగర్ మండల పరిధిలోని కయేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చింతకుంట తండాకు చెందిన కాట్రావత్ లక్ష్మణ్, కాట్రావత్ పట్నిల కుమార్తె తులసి(16)కు కర్నూలు జిల్లా వర్కల్ మండలం కాల్వబుద్ద గ్రామ పరిధిలోని గుడెంబాయి తండాకు చెందిన గోపాల్ (35)తో పెళ్ళి చేయడానికి నిర్ణయించారు.
అతనికి ఇదివరకే పెళ్ళి కాగా రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయింది. తన కొడుకు(11), కూతురు (10)లను చూసుకునేందుకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తులసికి జూన్ 4వ తేదీన అతనితో పెళ్లి చేయడానికి నిర్ణయించారు. అయితే తాను 10వ తరగతి పూర్తి చేశానని, పై చదువులు చదువుకుంటానని, తనకు పెళ్ళి ఇష్టం లేదని, పెళ్లిని ఆపాలని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమె తల్లిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి తులసిని మహబూబ్‌నగర్ స్టేట్‌హోమ్‌కు తరలించామని, అక్కడే కాలేజిలో అడ్మిషన్ ఇప్పించనున్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. వారిద్దరిని స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయనున్నట్లు చెప్పారు.
Advertisement