మిర్యాలగూడ : మిర్యాలగూడలోని ఎన్‌టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లీజు దారులతో అధికారులు కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు మాయమయ్యూయి. అందువల్లే గడువు ముగి సినా లీజుదారుల షాపులను ఖాళీ చేయించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లతరబడి అద్దె పెంచకపోవడంతో మున్సిపల్ ఆదాయూనికి గండిపడుతోంది.
పదేళ్ల నుంచి అదే కిరాయి...
ఎన్‌టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో 90 దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీ స్టోర్ రూంల కోసం రెండు దుకాణాలు ఉండగా...అద్దెకు ఇచ్చారు. 2001లో ఆరు షాపులు, 2002లో 60 షాపులు, 2004లో 22 షాపులకు ఓపెన్ టెండర్లు నిర్వహించి అద్దె నిర్ణయించారు. ఒక్కొక్క షాపునకు రూ. 2,400 నుంచి రూ. 4,000గా అద్దె నిర్ణయించారు. నాటి నుంచి ఇప్పటివరకూ అదే అద్దె వసూలు చేస్తుండడంతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఏళ్ల తరబడిగా మున్సిపల్ షాపుల్లో వ్యాపారాలు సాగిస్తున్నా.. అద్దె మాత్రం పెంచడం లేదు.
మాయం కావడం వల్లేనా..
మున్సిపల్ కాంప్లెక్స్‌లో షాపుల లీజుల కోసం ఒప్పందం కుదుర్చుకున్న మున్సిపాలిటీ వారు పత్రాలను భద్రపరచడంలో విఫలమైనట్లు సమాచారం. మొదట్లో టెండర్ ద్వారా షాపులను అద్దెకు తీసుకున్న లీజు దారులు ఐదేళ్లు, మూడేళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత గడువు ముగిసినా.. అద్దె పెంచలేదు. ఈ క్రమంలో లీజుదారులు రీ టెండర్ నిర్వహించకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో మున్సిపాలిటీ వారు ఏమీ చేయలేక నామమాత్రపు అద్దె వసూలు చేస్తున్నారు. అయితే గడువు ముగిసిన వారిని కూడా ఖాళీ చేయించక పోవడం, రీ టెండర్ నిర్వహించక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీజు దారులతో ఒప్పంద పత్రాలు మాయం కావడం వల్లే ఖాళీ చేయించలేకపోతున్నారని పలువురు అనుమానిన్నారు.
నోటీసులతోనే సరి
ఎన్‌టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో లీజు దారులు ఉండకుండా సబ్ లీజులకు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారని పట్టణానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త లోకాయుక్తకు 2013లో ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాల మేరకు అప్పటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు విచారణ జరిపి 60 మంది దుకాణదారులకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా లీజు దారులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే తొలగింపుపై మున్సిపల్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో లీజుదారులు దుకాణాలను ఇప్పటివరకూ ఖాళీ చేయలేదు. మూడేళ్ల పాటు దుకాణాలు లీజుకు తీసుకున్న వారి గడువు ముగిసినా.. ఖాళీ చేయడం లేదు.
సబ్ లీజులకు ఇచ్చి..
మున్సిపల్ కాంప్లెక్స్‌లో షాపులను లీజుకు తీసుకున్న రాజకీయ నాయకులు, ఇతరులు సబ్ లీజులకు ఇచ్చారు. ఈ విధంగా వారు వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారు. నామమాత్రపు అద్దెతో లీజుకు తీసుకున్న వ్యాపారులు ఒక్కొక్క షాపునకు రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు సబ్ లీజుకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా.. ముందస్తుగా ఒక్కో షాపు నుంచి లక్ష రూపాయల అడ్వాన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓపెన్ టెండర్లు నిర్వహిస్తే మున్సిపాలిటీకి ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.
అఖిలపక్షంతో సాధ్యమయ్యేనా..
గడువు ముగిసినా.. కోర్టు స్టేతో కాంప్లెక్స్‌లో యథావిధిగా వ్యాపారాలు సాగిస్తున్న వారిని ఖాళీ చేయించడానికి అఖిలపక్షం ఏర్పాటైంది. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తోపాటు ఒక్కొక్క పార్టీకి ఒకరి చొప్పున నలుగురు కౌన్సిలర్లను మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యుల సూచన మేరకు కాంప్లెక్స్‌లో గడువు ముగిసిన లీజు షాపులను ఖాళీ చేయించి రీ టెండర్ నిర్వహించాలని భావిస్తున్నారు. కానీ.. కోర్డు వివాదంలో ఉండడం వల్ల సాధ్యాసాధ్యాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంప్లెక్స్‌లోని షాపులు కబ్జాకు గురి కాకుండా అఖిలపక్ష కమిటీకి సాధ్యమవుతుందా.. లేదా.. వేచి చూడాలి.
ఒప్పంద పత్రాలు మాయం!
Published Thu, Apr 21 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement