మిషన్ కాకతీయకు సహకరించండి
- ప్రవాస భారతీయులకు మంత్రి హరీశ్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో భాగస్వాములైన విధంగానే తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. సొంత గ్రామంలోని చెరువులను దత్తత తీసుకుని నిధులు సమకూర్చగలిగే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయులకు ఆరు పేజీల బహిరంగ లేఖ రాశారు. చెరువుల పునరుద్ధరణకు గల ప్రాముఖ్యాన్ని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందులో వివరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ‘ఊరికి, స్వదేశానికి దూరంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీరు పడిన తపన, రాష్ట్ర సాధనకు మీరిచ్చిన ప్రత్యక్ష, పరోక్ష సహకారాన్ని తెలంగాణ సమాజం మరవదు.
ప్రపంచవ్యాప్తంగా సంఘాలు స్థాపించుకుని ప్రజల ఆకాంక్షకు మద్దతు కూడగట్టడానికి మీరు చేసిన కృషి వెలకట్టలేనిది. ప్రస్తుతం తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మీ ఊరి చెరువును దత్తత తీసుకొని నిధులు సమకూర్చగలిగే అవకాశాన్ని పరిశీలించండి.
వ్యక్తిగతంగా కానట్లయితే మీ సంఘం, సంస్థ తరపున ఆ అవకాశాన్ని పరిశీలించండి... దత్తత తీసుకున్న చెరువుకు మీరు కోరుకున్న పేరు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఊరి చెరువుల దత్తతకు ముగ్గురు వ్యక్తులు ముందుకువచ్చారు. వారిని అభినందిస్తున్నాం.. జనవరిలో కార్యక్రమం ప్రారంభం అయ్యాక మీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని భావిస్తున్నా’ అని లే ఖలో పేర్కొన్నారు.