అధికార దర్పం, ఆడంబరాలకు దూరం ఆ కుటుంబం.. మంది మార్బలం, పెత్తనం చెలాయించే అవకాశమున్నా.. ఏ కోశాన కూడా వాటికి చోటివ్వరు. ప్రతిరోజు ఓ పర్వదినంలా భక్తి భావంతో ఇంటిల్లిపాది గడిపే తత్వం అలవర్చుకున్నారు. రెండుసార్లు (2009, 2018) ఎమ్మెల్యేగా గెలిచినా సొంతిల్లు కూడా లేని నిరాడంబర జీవితం ఆయనది. పదవీలో ఉన్నా లేకున్నా సింపుల్‌గా ఉండడమే తెలుసు వారికి.
వారే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలోనూ రాజకీయంగా గుర్తింపు పొందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. అదే బాటలో సాగే ఆయన సతీమణి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన తులసి సక్కుకు కొండంత బలం. ఆదివారం పరిషత్ ఎన్నికల హడావేడిలో ఉన్నా ఆత్రం సక్కు ‘పర్సనల్ టైం’లో ‘సాక్షి’ కోసం ఖాళీ సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యేగా ఉంటూ బయటకు కనిపించని రాజకీయేతర కోణాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘సాక్షి’తో ఆయన జరిపిన ఎక్స్‌క్లూజివ్ నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూ..
సాక్షి, ఆసిఫాబాద్: మాది తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీపూర్. నాన్న ఆత్రం రాజు. అమ్మ మన్కుబాయి. అక్క భద్రుబాయి. మారుమూల గిరిజన ప్రాంతం కావడంతో అస్సలు సాగునీటి వసతులు లేక నాన్న రోజు పంట పండించేందుకు ఎంతో చెమటోడ్చేవారు. ఇదంతా చూస్తు పెరిగా. ప్రాథమిక విద్యాభ్యాసం లక్ష్మీపూర్‌లో, ఇంటర్మీడియెట్ లక్సెట్టిపేటలో ముగిసింది.
ఆ తర్వాత ఏడాది పాటు వ్యవసాయం చేశాను. 1993లో ఐటీడీఏలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదట పోస్టింగ్ తిర్యాణి మండలం గోపెరా ఐటీడీఏ స్కూల్. అప్పట్లోనే మా నాన్న ఐదో తరగతి వరకు చదువుకుని ఉండడంతో మాకు చుట్టూ ఉన్న పరిస్థితులను మాకు చెప్పేవారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేయాలనే వారు. దీంతో చిన్నప్పటి నుంచే సింపుల్‌గా ఉండడం అలవడింది. అప్పట్లో నేనున్న ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం, ఆదివాసీ ఉద్యమాల ప్రభావం నన్ను నిరాడంబర వైపు నెట్టాయి.
రెండు రోజులు చెప్పులు వేసుకోను..
నా విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికంగా గడపడం నాకిష్టం. శివుడు, హన్మాన్‌తో పాటు మా కులదేవత పెర్సపెన్, ఇష్ట దైవం జంగుబాయిని నిత్యం పూజిస్తా. ప్రతి అమవాస్య, పౌర్ణమి రోజున కాళ్లకు చెప్పులు కూడా వేసుకోను. మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ సమయంలో కాళ్లకు చెప్పులు వేయనని నిష్టతో ఉండి మూడేళ్ల పాటు కాళ్లకు చెప్పులే వేసుకోలేదు.
ఎమ్మెల్యేగా గెలిచాక మళ్లీ వేసుకున్నా. జంగుబాయి క్షేత్రాన్ని గెలిచినా, ఓడినా సందర్శిస్తాను. ప్రతి శుక్రవారం శివుడికి, మంగళవారం హన్మాన్ ఉపవాసం ఉంటాను. 18 ఏళ్ల క్రితం అరెస్టు అయి జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఈ భక్తి మరింత పెరిగింది. ప్రతిఏడు పుష్యమాసం (జనవరి)లో జై జంగో జై లింగో, హన్మాన్ మాల వేసి నిష్టతో ఉంటా. నా చిన్న కూతురు పేరు నా ఇష్ట దైవం పేరు మీదుగా జంగుబాయి అని నామకరణం చేశా. నా ఆధ్యాత్మిక గురువు కుస్రం హనుమంతరావు. మద్యం అలవాటు లేదు. గతంలో మాంసాహారం తినేవాడిని. ప్రస్తుతం పూర్తిగా మానేశా.
పిల్లల పెంపకం ఆమెదే.!
నిత్యం ప్రజలతో ఉండడంతో కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోతా. 1994లో చిన్ననాటి క్లాస్‌మేట్, నా తోటి ఉపాధ్యాయురాలైన తులసితో ప్రేమ వివాహం జరిగింది. మాకు ఆరుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. పిల్లల పెంపకం బాధ్యత మొత్తం మా ఆవిడ తులసి చూసుకుంటోంది. పెద్దమ్మాయి దివ్య లక్ష్మీకి వివాహం అయింది. పెద్దబ్బాయి వినోద్‌కుమార్ డిగ్రీ పూర్తి చేశాడు. రెండో అబ్బాయి అంకిత్ డీఈడీ చేస్తున్నాడు. మూడో అబ్బాయి అన్వేశ్ తొమ్మిదో తరగతి, రెండో అమ్మాయి హిమ బిందు ఏడో తరగతి, చిన్నమ్మాయి జంగుబాయి నాలుగో తరగతి చదువుతోంది.
ఆ ఒక్కటే తీరని లోటు
చిన్నప్పుడు మా నాన్న చేతనైనంత వరకు తోటి వారికి సాయం చేయాలనే చెబుతుండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక అనేక మందికి సాయం చేస్తున్నా. ఇలా ఎమ్మెల్యేగా ఉండి, పదిమందికి సాయం చేయడం, చేసే భాగ్యం ఆయనకు లేదని నన్ను ఎప్పటికీ బాధ పెడుతుంటుంది. నాన్న బతికుంటే ఎవరికైనా ఏదైనా చేయాలని సూచిస్తే వెంటనే చేసి ఆయనను సంతోషపెట్టేవాడిని. కాని ఆ అవకాశం నాకు లేకుండా పోయింది. అయినా నా దగ్గరికి ఎవరైనా విద్య, వైద్యం, వ్యవసాయం, పెళ్లి, దైవం ఈ ఐదింటిలో ఎవరైనా సాయం కోరి వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇది ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సాయం కొనసాగుతుంది.
డ్యాన్స్ చేస్తా.. డోలు వాయిస్తా..
నాకు మా సంప్రాదాయ డోలు వాయించడం అంటే ఇష్టం. తుడుం మోగిస్తా. డ్యాన్స్ కూడా చేస్తాను. పాటలు కూడా పాడతాను. బహిరంగ సభల్లో మాటల కంటే ముందుగా ఓ చిన్న పాటతో నా ప్రసంగం మొదలు పెడుతుంటాను. టీచర్‌గా పనిచేసినప్పుడు క్లాస్ రూంలో పిల్లలకు పాటల రూపంలో పాఠాలు చెప్పే క్రమంలో పాటలు పాడటం మొదలైంది.
కొమ్ములు రావు కదా.?
ఓ ఎమ్మెల్యే భార్య అయినంత మాత్రాన మాకు కొమ్ములు రావు గదా.? అప్పడు..ఇప్పుడు.. ఎప్పుడూ ఒకేలా ఉండుడే మాకు తెలుసు. మాకు సింపుల్‌గా బతకడమే ఇష్టం. ఉదయం ఎవరైనా స్కూల్‌కి బైక్‌పై తీసుకెళ్తే, సాయంత్రం ఆర్టీసీ బస్సులో తిర్యాణి నుంచి ఆసిఫాబాద్‌కి వస్తా. ప్రభుత్వ టీచర్‌గా నా విధులు నిర్వహిస్తా. కారు వాడడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో అంతా భక్తిభావంతో ఉంటాం. దీక్షా సమయంలో అంతా చెప్పులు లేకుండా ఉంటాం. ఇంట్లో మాంసాహారం వండడం పూర్తిగా మానేశాం. 2001 నుంచి భక్తి భావంతో కాళ్లకు పూర్తిగా చెప్పులు వేయడం మానేశా. కుటుంబంతో దూరంగా ఉంటేనే కదా. ఆయన ప్రజలకు దగ్గరగా ఉండేది. కాబట్టి ఆయనను తొందరగా ఇంటికి రావాలని ఎప్పడూ ఇబ్బంది పెట్టను. – ఆత్రం తులసి, సక్కు సతీమణి,
‘‘మొదటిసారిగా 2009లో, రెండోసారి 2018లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా. ఆడంబరాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. కూలీ పనులకు వెళ్లా, అడవిలో తిరిగి తునికాకు కోసిన. పేదరికం, ఆకలి విలువ బాగా తెలుసు. ఆదివాసీల సాధక బాధలు చూస్తూ పెరిగా. పూర్తిగా సాధారణ జీవితం గడపడమే నాకిష్టం. సొంతిల్లు లేదనే బాధ లేదు. ఆస్తులు కూడబెట్టాలనే కోరిక లేదు.’’
‘‘పెళ్లి అయి ఇన్నాళ్లు అవుతున్నా మేం కలసి ఒక్క సినిమాకు గానీ, షాపింగ్‌కు గాని ఇప్పటి వరకూ వెళ్లలేదు. ఇద్దరికీ సాదాసీదాగా ఉండడమే ఇష్టం.’’
Comments
Please login to add a commentAdd a comment