రెండేళ్లలో పుష్కలంగా సాగునీరు | MLA Goud Development Activities In Mahabubnagar | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో పుష్కలంగా సాగునీరు

Published Thu, Jul 26 2018 12:29 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

MLA Goud Development Activities In Mahabubnagar - Sakshi

 కోటకదిరలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పాలమూరు ఎత్తిపోతల పథకం అమలులో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్‌ ద్వారా రాబోయే రెండేళ్లలో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రస్తుతం కర్వెన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రిజర్వాయర్‌ నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసి రిజర్వాయర్‌ నీటితో గ్రామాలలోని చెరువులను నింపుతామన్నారు. బుధవారం మండలంలోని ధర్మాపూర్, కోటకదిర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి సుమారు రూ.1.68 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ధర్మాపూర్‌ గ్రామంలో అంగన్‌వాడీ భవనం, ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్, అదనపు తరగతి గదులు, మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ను ప్రారంభించారు. కోటకదిర గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయంతో పాటు అంగన్‌వాడీ భవనం, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా నెల రోజుల్లో ఇంటింటికి శుద్ధ జలాలను అందిస్తామని అన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా కృష్ణా జలాలను ఇంటింటికి నల్లాల ద్వారా అందించేందుకు అవసరమైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పనులన్ని నిర్ణీత సమయంలో కొనసాగడం వల్ల అనుకున్న సమయానికి తాగునీటిని అందిస్తామని తెలిపారు.

ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి 
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ శ్రమిస్తున్నారని, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం సొమ్ము పెంపుతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరనప్పటికినీ తెలంగాణ ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి ఉరకలేస్తుందని అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, రైతుబంధు పథకం, రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యురాలు వై.శ్రీదేవి, వైస్‌ ఎంపీపీ మల్లు సరస్వతమ్మ, సర్పంచ్‌లు పసుల వసంత, మల్లు ప్రియాంక, ఎంపీటీసీలు నాగమణి, మల్లు దేవేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ టి.కురుమూర్తి, ఎంపీడీఓ మొగులప్ప, పీఆర్‌ ఏఈ శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా డైరెక్టర్‌ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, నాయకులు వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, మాజీ సర్పంచ్‌ ఆంజనేయులు, పసుల వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
 
రోడ్డు సమస్యలపై చర్చ 
పాలమూరు:  జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రోడ్డుపై బుధవారం హైదరాబాద్‌లోని లాల్‌మంజిల్‌ ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాలయంలో జాతీయ రహదారుల సీఈ రవిప్రసాద్, ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడు కలిశారు. అప్పన్నపల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు పట్టణంలో వెళ్తున్న ప్రధాన రోడ్డు ఒక్కటే ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం లేకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టెండర్లు పూర్తి చేసి ప్రధాన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement