కొడంగల్: నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, వారి ఆశీర్వాదంతో తాను రాజకీయాల్లో ఎదుగుతున్నట్లు కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంతో పాటు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం కోస్గి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ, ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో చెల్లని రూపాయి కొడంగల్‌లో ఎలా చెల్లుతుందని పరోక్షంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరుల కుటుంబాలకు దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు అయూబ్‌ఖాన్ ఆత్మబలిదానమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, రాహుల్‌గాంధీకి అమేథి ఎలాగో.. తనకు కొడంగల్ నియోజకవర్గం అలాగే అని తెలిపారు. తాను చనిపోతే తన సమాధి కొడంగల్‌లోనే నిర్మిస్తారని భావోద్వేగంగా అన్నారు. తెలంగాణ సమాజాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ మొత్తం ఆ నలుగురి చేతుల్లో ఉందని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. రైతులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులు, కా>ర్మికులు, కర్షకులు, సకల జనులు, అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తిపోస్తున్నాయని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.
కొంతమంది స్వార్థపరులు కాసుల కోసం కక్కుర్తి పడి అమ్ముడుపోతున్నారని, తానకు అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలు, నాయకులను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌లకు దమ్ముంటే కొడంగల్‌లో నిలబడి గెలవాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పతనానికి కొడంగల్ నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దోపిడీ దొంగలను తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులతో పాటు స్థానిక నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీరాంరెడ్డి, సుభాష్‌నాయక్, మహ్మద్ యూసూఫ్, నందారం ప్రశాంత్, ఏపూరు కృష్ణారెడ్డి, బీ వెంకట్‌రెడ్డి, వెంకటరాములు గౌడ్, నర్సింగ్‌బాన్‌సింగ్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment