ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారవేడి తీవ్రరూపం దాల్చింది. వివిధ పార్టీల అభ్యర్థుల తరఫున జాతీయ, రాష్ట్రస్థారుు నేతల ప్రచారంతో ఆదివారం జిల్లా హోరెత్తింది. బీజేపీ అభ్యర్థి విజయం కోసం ఏకంగా కేంద్ర మంత్రి, టీఆర్‌ఎస్ గెలుపే ధ్యేయంగా రాష్ట్ర మంత్రులు, తీన్మార్‌కు మద్దతుగా టీపీసీసీ, వామపక్షాల అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీల రాష్ట్రస్థారుు నేతలు వచ్చి ప్రచార ఉధృతి పెంచారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయూ పార్టీల శ్రేణులు కదంతొక్కుతున్నారుు.
కేంద్ర మంత్రులతో బీజేపీ
టీడీపీ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావు తరఫున ప్రచారం నిర్వహించడానికి ఏకంగా ఆ పార్టీ కేంద్రమంత్రులను రంగంలోకి దింపింది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో సదానందగౌడ్, వరంగల్‌లో నిర్మలాసీతారామన్ ప్రచారం చేశారు. జిల్లా కేంద్రానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని రప్పించి పట్టభద్రుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఖమ్మంలో నిర్వహించిన ఈ సదస్సుకు ఇటు బీజేపీ, అటు టీడీపీ నేతలంతా హాజరయ్యారు. ఇరు పార్టీల నేతలు రామ్మోహన్‌రావు సమాజ సేవకుడని.. ఆయన వ్యక్తిత్వం చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వెంకయ్యనాయుడు ప్రసంగంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా విమర్శలు చేయకుండా మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు కితాబు ఇస్తూ ప్రసంగం ద్వారా పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు కూడా రామ్మోహన్‌రావు వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. రామ్మోహన్‌రావు మాత్రం తన ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు. వెంకయ్యనాయుడు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తారని, తెలుగు స్పష్టంగా మాట్లాడే వ్యక్తి కావడంతో ముందస్తు ప్లాన్‌తో ఆయన్ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రచారానికి ఆహ్వానించింది.
పల్లాకు దన్నుగా రాష్ట్ర మంత్రులు
బీజేపీ కేంద్ర మంత్రులతో ప్రచారం చేయిస్తుండటంతో టీఆర్‌ఎస్ రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార బాధ్యతలు పెట్టారు. పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ప్రచారం చేయాలని ఆదేశించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి భద్రాచలం, అశ్వాపురం, ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించారు. ఎక్కువగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. ప్రచారంలోనూ నేతలు ఈ వర్గాలను కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
తీన్మార్‌కు టీపీసీసీ జై
తీన్మార్ మల్లన్న (నవీన్‌కుమార్)కు మద్దతుగా టీపీసీసీ కదిలింది. కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలిసారి జిల్లాకు వచ్చారు. తీన్మార్ మల్లన్నకు మద్దతుగా జిల్లా నుంచే ఉత్తమ్ తొలిసారి ప్రచారంలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య ఉండగా మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత పొన్నాలను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కొన్ని రోజులు తర్వాత ఉత్తమ్‌కు పగ్గాలు అప్పగించారు. జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతగా విభేదాలు లేకపోవడంతో ఉత్తమ్ ప్రచారానికి జిల్లాను ఎంచుకున్నారని సమాచారం. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తుండటం.. నాయకులు తలోదారిలో పోతుండటంతో జిల్లాను ఎంచుకున్నట్లు తెలిసింది. మల్లన్నకు మద్దుతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలుతున్నా నాయకులు మధ్య ఉన్న విభేదాలతో పార్టీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఖమ్మం ప్రచార సభలో ఉత్తమ్ రాష్ట్రం ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆపార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలో మాత్రం పార్టీ నేతలందరూ ఏకతాటి పైకి వస్తేనే మల్లన్న ప్రచారం దూసుకెళ్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు.
ఐక్యతతో వామపక్షాలు..
ఇటీవల సీపీఎం, సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఐక్యతా రాగం వినిపించటం, ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో పది వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించాయి. రాష్ట్ర మహాసభలు వేదికగా సీపీఎం, సీపీఐ వామపక్షాల అభ్యర్థిని పరిచయం చేశాయి.
బస్సుయాత్రతో ప్రచారానికి వామపక్షాలు పదునుపెట్టాయి. నల్లగొండ జిల్లాలో ప్రచారం ముగించుకున్న అనంతరం జిల్లాలో కూసుమంచి, ఖమ్మం, కొణిజర్లలో ఆ పార్టీ నేతలు ఆదివారం ప్రచారం చేశారు. రామకృష్ణ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సభకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. దేశ చరిత్రలోనే అన్ని వామపక్షాల తరఫున ఒక్కరినే ఎన్నికల బరిలోకి దించడం ఇదే ప్రథమమని.. ఆయా పార్టీల నేతలు జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఉన్న విభేదాలన్నింటినీ లెఫ్ట్‌పార్టీలు పక్కనబెట్టి ఐక్యతతో ప్రచారం నిర్వహిస్తుండటంతో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.