మోడల్ నిర్మాణాలు!
పరిగి, న్యూస్‌లైన్: ఈ విద్యా సంవత్సరం కూడా మోడల్ స్కూళ్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. మరో నెల రోజుల్లో 2014-15 సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభం కావాల్సిఉంది. కానీ 33 నెలలు క్రితం అట్టహాసంగా శంకుస్థాపన చేసిన భవనాలు మాత్రం పూర్తి కాలేదు. ఇక మరో వైపు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ వివాదమైంది. భవన నిర్మాణాలు, విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియలోనూ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులనుచేర్చుకునేందుకు విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం.. రెండు సంవత్సరాలుగా విద్యార్థులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉంది. జూన్, జూలై నెలల్లో హడావిడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు.. అనంతరం స్వీకరించిన దరఖాస్తులను చెత్తబుట్టలో పడేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు శంకుస్థాపనచేసి 33 నెలలు గడుస్తున్నా మోడల్ స్కూళ్ల భవన నిర్మాణాలకు గ్రహణం వీడడం లేదు.
శిలాఫలకాలకే పరిమితం..
ఆదర్శ పాఠశాలల ఏర్పాటు కోసం 2011-12 విద్యా సంవత్సరానికి ముందు జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలకు అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితారెడ్డి శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మోడల్‌స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదు పాఠశాలల భవనాలకు రూ.15కోట్లు మంజూరు చేశారు. 2011 జూన్ 28న ఒకేరోజు నియోజకవర్గ పరిధిలోని ఐదు స్కూళ్లకు సబితారెడ్డి శిలాఫలకాలు వేశారు. కానీ ఇప్పటివరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు.
స్థలాలకు నిధులేవీ?
శిలాఫలకాలు వేసింది మొదలు ఆదర్శ పాఠశాలల ఏర్పాటులో అనేక ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.మూడు కోట్లు మంజూరు చేసినప్పటికీ స్థలాల కొనుగోలుకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో కొన్ని చోట్ల శంకుస్థాపనకు ముందే స్థల వివాదాలు తెరపైకి వచ్చాయి. మండల కేంద్రాల్లో అందరికీ అందుబాటులో ఉండాల్సిన పాఠశాలలు మారుమూల గ్రామాలకు తరలిపోయాయి. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో, గండేడ్ మండలం వెన్నచ్చేడ్‌లో, పూడూరు మండలం మన్నెగూడలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభం కాగా దోమ మండలానికి చెందిన దిర్సంపల్లి, దాదాపూర్ గ్రామాల మధ్య ఈ విషయమై పెద్దవివాదమే తలెత్తింది. అది క్రమంగా రాజకీయ రంగు పులుముకొని భవన నిర్మాణానికి అడ్డంకిగా మారింది. పరిగిలో శంకుస్థాపన చేసిన మినీస్టేడియం స్థలం వివాదాల్లోకి వెళ్లడంతో ఇక్కడ పాఠశాల నిర్మాణం ఆగిపోయింది. మండల పరిధిలోని జాపర్‌పల్లి గుట్టపై స్థలాన్ని పరిశీలించి పునాదులు తీశారు. కానీ ఇప్పటికీ ఆ భవనం బెస్మెంట్ లెవల్ దాటలేదు.
తల్లిదండ్రుల ఎదురుచూపు
పిల్లలను ఆదర్శ పాఠశాలల్లో చేర్చేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారు. గత రెండేళ్ల నుంచి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ తరగతులు మాత్రం ప్రారంభం కావడంలేదు. ఈ ఏడాదీ అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు.