సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. ప్రధానిగా చేసిందేమీలేదని, అందుకే విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఆయన అనుచరులు గురువారం ఇక్కడ తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌లో చేరినవారిని ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ‘డైలాగ్‌లు తప్ప మోదీ చేసిందేమీలేదు. చెప్పుకునేది ఏమీలేక హిందూ, ముస్లిం... ఇండియా, పాకిస్తాన్ అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
మోదీ చౌకీదార్ అని, కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ టేకేదార్ అంటూ ఎవరికీ అర్థం కాని భాష మాట్లాడుతున్నారు. దేశానికి చౌకీదార్లు, టేకేదార్‌లు కాదు... జిమ్మేదార్ లాంటి మనిషి కావాలి. బీజేపీ వాళ్లు లొల్లి, పెడబొబ్బలు పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా 300 సీట్లు గెలుస్తామంటున్న బీజేపీ నేతలు తెలంగాణలో 3 సీట్లు గెలిపించి చూపించాలి. అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఇప్పటిలాగే మాట్లాడి అభాసుపాలయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ ముగ్గురు కార్పొరేటర్ స్థానాలను గెలవలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా వంద నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజి ట్లు రాలేదు. తెలంగాణలో బీజేపీ నేతలకు దమ్ముంటే 3 సీట్లు గెలిచి చూపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. కేంద్రం మన రాష్ట్రానికి ఏం ఇచ్చిందో మోదీ చెప్పలేదు’ అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ శక్తి మేరకు పనిచేస్తారు...
‘16 ఎంపీలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఏం చేస్తారని కొందరు అడుగుతున్నారు. ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదని కేసీఆర్ చెప్పారు. దేశం గతి మార్చేందుకు ఎంపీల బలంతో కేసీఆర్ శక్తి మేరకు పనిచేస్తారు. రెండు ఎంపీ సీట్లతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాం. ఇద్దరు ఎంపీలతోనే అన్ని రాజకీయ పార్టీలను కదిలించిన కేసీఆర్... 16 సీట్లతో ఎన్ని అద్భుతాలు చేస్తారో మీరే చూస్తారు. మందబలం కాదు. దేశ రాజకీయాల్లో ముద్రవేసే నాయకుడు కావాలి. కౌరవులు వంద మంది ఉన్నా ఐదుగురు ఉన్న పాండవులే యుద్ధంలో గెలిచారు’ అని కేటీఆర్ అన్నారు. ‘ప్రవీణ్‌రెడ్డి ఆజాత శత్రువు. వివాద రహితుడు, సౌమ్యుడు.
కరీంనగర్ జిల్లాలో పార్టీలు వేరయినా నాయకుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఇలాంటి మంచి సంస్కృతి వేరేచోట కనిపించదు. ప్రవీణ్‌రెడ్డి చేరిక విషయాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు చెప్పినపుడు వెంటనే అంగీకరించారు. సీఎం కేసీఆర్ సహకార వ్యవస్థ గురించి చెప్పినపుడల్లా ప్రవీణ్‌రెడ్డి తండ్రి విశ్వనాథరెడ్డి పేరు ప్రస్తావిస్తుంటారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత పంటలకు గిట్టుబాటు ధరలు అందించడం సవాల్ లాంటిది.
దీన్ని అధిగమించేందుకు సహకార వ్యవస్థను పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సహకార వ్యవస్థ బలోపేతంలో సీఎం కేసీఆర్, ప్రవీణ్‌రెడ్డి సేవలను వాడుకుంటారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్‌ల కేటాయింపులో కొత్త, పాత తేడా లేకుండా సమర్థులకే అవకాశం ఇస్తాం. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపు ఖాయమైంది. మెజారిటీపై దృష్టి సారించాలి. వినోద్‌కుమార్ కాబోయే కేంద్రమంత్రి అని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
మిషన్ భగీరథ అద్భుత పథకం: ప్రవీణ్‌రెడ్డి
అందరికీ శుద్ధమైన తాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ మంచి పథకమని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అన్నారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తోంది. ప్రజలు అనుకున్నదాని కంటే పది రెట్లు ఎక్కువగా కేసీఆర్ వారికి మేలు చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్‌కు అండగా ఉండాలని కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా’అని ప్రవీణ్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment