* సర్కారీ పనులకు టెండర్ల అనుమతి విధానంలో మార్పులు
* సీవోటీకి వెళ్లే టెండర్ల విలువ పరిమితి 2 నుంచి 10 కోట్లకు పెంపు
* మంత్రుల బృందం కీలక నిర్ణయం, ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి
* తాజా నిర్ణయంతో లోపించనున్న పారదర్శకత
* టెండర్ల ఆమోదానికి ఒత్తిళ్లు పెరుగుతాయంటున్నఅధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో అవినీతికి తావుండకూడదని, పాలనలో పారదర్శకత పెరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు వెలువడుతున్నాయి. అవినీతికి ఆస్కారమిచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి. ఇప్పటికే నామినేషన్‌పై ఇచ్చే పనుల విలువను లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని ఉన్నతాధికారులు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
తాజాగా రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావుతో కూడిన మంత్రుల బృందం శనివారం సమావేశమై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కోట్ల రూపాయల పరిమితిని దాటే ప్రభుత్వ పనులన్నింటికి సంబంధించిన టెండర్లను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు పంపి ఆమోదం పొందాల్సి ఉంటుం ది. ఈ సీవోటీలో ఆరేడు శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. అయితే తాజాగా ఈ పరిమితిని రూ. రెండు కోట్ల నుంచి పది కోట్లకు పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించింది. అంటే రూ. పది కోట్లకుపైగా విలువైన పనులకు మాత్రమే ఇకపై సీవోటీ అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా సంబంధింత టెండర్ ఫైళ్లపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆలోపే వెల్లడించాలి. లేదంటే ఆ టెండరుకు సీవోటీ ఆమోదం లభించినట్లు(డీమ్డ్ టూబీ అప్రూవ్డ్)గా భావించాలని మంత్రులు నిర్ణయించారు. ఒక దశలో సీవోటీ కారణంగా టెండర్లు ఆలస్యమవుతున్నాయని, దాన్ని తొలగించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే సీవోటీ ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రధానంగా రోడ్లుభవనాలు, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోనే వేల కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ పనులు జరుగుతుంటాయి. మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయం అమలైతే రూ. 10 కోట్లలోపు విలువైన పనులకు ఇకపై సంబంధిత శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) లేదా చీఫ్ ఇంజనీర్ పరిధిలోనే అనుమతులు లభిస్తాయి.
సాధారణంగా సీవోటీలో అయితే అన్ని శాఖల ఈఎన్‌సీలు సభ్యులుగా ఉండడం వల్ల టెండర్ నిబంధనలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను తెలిపేందుకు ఆస్కారముంటుంది. అలాకాకుండా సంబంధిత శాఖ ఇంజనీరింగ్ విభాగాధిపతికే పూర్తి అధికారముంటే ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తాజా నిర్ణయం వల్ల పంచాయతీరాజ్ శాఖలో ఏ ఒక్క పని కూడా కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు వెళ్లదని, ఆ శాఖ ఈఎన్‌సీ స్థాయిలోనే టెండర్లు ఖరారవుతాయని సమాచారం. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించిన పనుల విషయంలోనూ ఇదే విధానం అమలైతే పనుల నాణ్యత ఎలా ఉంటుందోనన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.
విధానాలకు తూట్లు
Published Sun, Jan 18 2015 3:31 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement
Advertisement