నిఘా నీడలో తెలంగాణ ఎంసెట్
14న ఎంసెట్‌కు భారీ ఏర్పాట్లు
హైటెక్ కాపీయింగ్ నిరోధానికి పక్కా చర్యలు
పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లను కూడా అనుమతించరు
పదేపదే ఎంసెట్ రాసేవారిపై ప్రత్యేక దృష్టి
‘సాక్షి’తో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్-2015కు పెద్ద ఎత్తున నిఘా, భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. గతంలో కంటే అత్యధికంగా దరఖాస్తులు రావడంతో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాచీల్లో స్కానర్లు వస్తున్నందున ఈసారి వాటిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించ మని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పదే పదే రాసే అనుమానితులపై పోలీసు నిఘా పెట్టామన్నారు. ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్లపై కన్వీనర్ రమణరావు ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
రికార్డు స్థాయిలో దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో తెలంగాణ జిల్లాల నుంచి 1.80 లక్షల దరఖాస్తులు మాత్రమే రాగా, ఈసారి 2.31,956 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ కోసం 1,39,605 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,351 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 41 వేల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల వారు మరో 9 వేల మంది ఉన్నారు.
మెడిసిన్ రాసే వారిపై ప్రత్యేక దృష్టి
పదే పదే ఎంసెట్ రాస్తున్న వారిపై, రూ. 5 వేల ఆలస్య రుసుము, రూ. 10 ఆలస్య రుసుముతో ఎంసెట్‌కు దరఖాస్తు చేస్తున్న వారిపై ప్రత్యేకంగా పోలీసుల నిఘా ఉంటుంది. ఆ వివరాలను ఇప్పటికే రెవెన్యూ, ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారులకు అందజేశాం. గతంలో ఎంసెట్ రాసి, మంచి ర్యాంకు సాధించినా మళ్లీ ఇపుడు ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను అందజేశాం. గతంలోనే మంచి ర్యాంకు వచ్చినా ఇపుడు మళ్లీ ఎందుకు రాస్తున్నారన్న కోణంలో పరిశీలన ఉంటుంది. 20 ఏళ్ల కిందట ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఇపుడు ఎందుకు ఎంసెట్ దరఖాస్తు చేశారు. ఏ ఉద్దేశంతో రాస్తున్నారు? ఎవరి కోసమైనా రాస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతారు. అంతేకాదు ప్రతి విద్యార్థి చేతి వేళ్ల ముద్రలు పూర్తిగా తీసుకుంటాం. ముఖ్యంగా ఈసారి మెడిసిన్ పరీక్షకు హాజరయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాం.