
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహణ భవిష్యత్‌లో మరింత మంది స్థానికులకు, అమెరికాలోని నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కత్రినా హడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. మైండ్ స్పేస్ భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత్, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రధాన సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకానున్న ఈ సదస్సులో 3,000 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సైబరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 28న సాయంత్రం 5 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్‌లో 130 అమెరికా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ సదస్సు ద్వారా మరిన్ని అమెరికన్ కంపెనీలకు ఇక్కడ అవకాశాలు లభిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా భాగస్వామ్య పారిశ్రామిక వేత్తల పురోగతితోనే ప్రపంచ భద్రత సాధ్యమవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జెన్నీఫర్ అరంగ్యో అభిప్రాయపడ్డారు. సగం మందికిపైగా మహిళా పారిశ్రామిక వేత్తలు సదస్సుకు హాజరవుతుండడంతో.. ఈ ఏడాది సదస్సు నినాదాన్ని ‘‘ఉమన్ ఫస్ట్ పాస్పరిటీ ఫర్ ఆల్’’గా పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా ఆరోగ్య పరిరక్షణ, జీవశాస్త్రం, డిజిటల్ ఎకానమీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా నాలుగు అంశాలపై సమాంతరంగా చర్చలు జరుగుతాయన్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, పర్యావరణ వేత్తలు పాల్గొనున్న ఈ సదస్సు ఆసియా ఖండంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్టు డాక్టర్ మురళీ కృష్ణకుమార్ తెలిపారు. సదస్సులో వివిధ దేశాల నుంచి హాజరవుతున్న నిపుణులు, పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలను పంచుకునే అవకాశం ఇక్కడ లభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment