mind space
-
హైఫై ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా చేపట్టిన వివిధ పనుల్లో పలు ప్రత్యేకతలు చూపింది. అసాధ్యమనుకున్న కేబుల్ స్టే బ్రిడ్జి వంటి పనులతో పాటు వివిధ ఫ్లైఓవర్లలో అడపాదడపా ప్రత్యేకతలు చూపుతున్నారు. నగరంలో ఇప్పటి వరకు లేని అధునాతన సాంకేతిక విధానాలు అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా మైండ్‌స్పేస్ దగ్గరి శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ అమరుస్తున్నారు. ఏమిటీ ప్రత్యేకత? ►ఫ్లైఓవర్ల మార్గాల్లో మలుపులు, మూలలు వంటివి వచ్చే ప్రాంతాల్లో పోర్టల్ ఫ్రేమ్స్‌ను వాడతారు. మెట్రో రైలు మార్గాల్లోనూ పలు ప్రాంతాల్లో ఇలాంటి పోర్టల్ ఫ్రేమ్స్ వినియోగించినట్లు ఇంజినీర్లు తెలిపారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్‌కు పోర్టల్ ఫ్రేమ్స్ అవసరమైన మూడు చోట్ల కాంక్రీట్ పోర్టల్ ఫ్రేమ్స్ బదులు స్టీల్ ఫ్రేమ్స్‌ను వాడుతున్నారు. స్టీల్ పోర్టల్ ఫ్రేమ్స్ వాడటం నగరంలో ఇదే మొదటిసారని, 23 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పు కలిగిన మొదటి స్టీల్ పోర్టల్ ఫ్రేమ్‌ను కాంట్రాక్టు ఏజెన్సీ విజయవంతంగా అమర్చిందని పనులు పర్యవేక్షిస్తున్న సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటరమణ తెలిపారు. ► మీనాక్షి టవర్స్ పరిసరాల్లో ఈ ఫ్లైఓవర్ మార్గంలో మొత్తం మూడు పోర్టల్స్ అవసరం. ఈ సంవత్సరం దీపావళి కానుకగా ఈ ఫ్లై ఓవర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫ్లైఓవర్ మార్గంలో రద్దీ సమయంలో వాహనాలు గంటకు 1464 పీసీయూ కాగా, 2040 నాటికి ఇది 5194 పీసీయూకు చేరుతుందని అంచనా. నాలుగు వరుసల్లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌పై రెండు వైపులా ప్రయాణం చేయవచ్చు. కొండాపూర్ వైపు నుంచి ఓఆర్‌ఆర్‌వైపు వెళ్లే ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై రెండో వరసలో భూమి నుంచి 18 మీటర్ల ఎత్తులో 64 మీటర్ల పొడవైన 3 స్టీల్ గర్డర్లను ఏర్పాటు చేయడం తెలిసిందే. (క్లిక్: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?) -
రియల్టీలో హైదరాబాద్ హవా! ఈ ఏడాది దేశంలోనే రెండో పెద్ద లీజ్ అగ్రిమెంట్
కరోనా కష్టాలు ఇబ్బంది పెడుతున్న రియల్టీలో హైదరాబాద్ దూసుకుపోతుంది. దేశంలో ఉన్న మెట్రో సిటీస్‌లో దూకుడు కనబరుస్తోంది. రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్, డీల్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కమర్షియల్ స్పేస్ విభాగానికి సంబంధించి దేశంలోనే పెద్ద డీల్స్‌లో ఒకటి ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగింది. మైండ్‌స్పేస్ దగ్గర నగరంలోని ఆఫీస్ స్పేస్‌కి ఫుల్ డిమాండ్ ఉన్న మైండ్‌స్పేస్ ఐటీపార్క్ దగ్గర 4,50,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ చేసినట్టు స్మార్ట్‌వర్క్ సంస్థ పేర్కొంది. లీజు అగ్రిమెంట్ పదేళ్లు ఉండగా ఇందులో ఐదేళ్ల కాలం లాక్ ఇన్ పీరియడ్‌గా ఉందని ఎకనామిక్టైమ్స్లో కథనం ప్రచురితమైంది. ఈ అగ్రిమెంట్ డీల్‌లో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించినట్టు సమాచారం. 4,000 మంది ఉద్యోగులు ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ డీల్ 2021 చివరి క్వార్టర్లో పూర్తవగా ఇక్కడ కార్యకలాపాలు 2022 మొదటి కార్వర్ట్‌లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ ఆఫీస్ స్పేస్‌లో ఒకేసారి 4,000ల మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకునే వీలుంది. రెండో స్థానం స్మార్ట్‌వర్క్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్‌కి సంబంధించి అతి పెద్ద లీజ్ అగ్రిమెంట్ పూనేలో చోటు చేసుకుంది. ఆ నగరంలోని బనేర్ లొకాలిటీలో 5,60,00 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ డీల్ జరిగింది. దాని తర్వాత రెండో అతి పెద్ద డీల్ భాగ్యనగరంలో చోటు చేసుకుంది. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ విభాగంలో స్మార్ట్‌వర్క్స్ సంస్థ దేశంలోని 9 పెద్ద నగరాల్లో 32 లొకేషన్లలో సేవలు అందిస్తోంది. ఫార్చున్ 500 జాబితాలోని 400ల సంస్థలకు స్మార్క్వర్క్ సేవలు అందిస్తోంది. ఈ ఏడాది మెట్రో సిటీల్లో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ డిమాండ్ 40 మిలియన్ల చదరపు అడుగులకు చేరినట్టు స్మార్ట్‌వర్క్స్ పేర్కొంది. చదవండి: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా.. -
ఐటీలో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీకి కేంద్ర బిందువుగా ఉన్న మాదాపూర్‌లో బుధవారం కోవిడ్ కలకలం రేగింది. మైండ్‌స్పేస్ బిల్డింగ్–20లోని డీఎస్ఎం కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా టెకీకి కోవిడ్ వచ్చిందనే సమాచారం రావడంతో ఐటీ జోన్ హై అలర్ట్ అయింది. వారం రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఆమెకు కోవిడ్ లక్షణాలు బయటపడడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మైండ్ స్పేస్‌లోని ఉద్యోగులు నిమిషాల వ్యవధిలోనే ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు సాఫ్ట్వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యా యి. వైరస్ నివారణ దిశగా చర్యలు చేపట్టాయి. హైటెక్ సిటీ, మాదాపూర్ ,గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, రాయదుర్గం ప్రాంతాల్లో దాదాపు 600కి పైగా ఐటీ సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలున్నాయి. వీటిలో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య, నైపుణ్య శిక్షణ తదితర కార్యకలాపాల్లో భాగంగా ఇక్కడి ఉద్యోగులు సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర దేశాలకు వెళ్లి రావాల్సి ఉంటుంది. అలాగే ఆయా దేశాల నిపుణులు సైతం సాధారణంగా నెలకు సుమారు 5వేల మంది వరకు ఇక్కడకి వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఐటీ జోన్లో కోవిడ్ కలకలం రేగడంతో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు పలు సూచనలు చేశాయి. కరచాలనం చేయడం నిలిపివేయాలని పేర్కొనడంతోపాటు విదేశీయానానికి, వారాంతపు టూర్లకు దూరంగా ఉండాలని ఆదేశించాయి. విదేశాలకు వెళ్లి వచ్చినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్పష్టంచేశాయి. తమ కార్యాలయ పరిసరాలు, కామన్ ఏరియాలను డిటర్జంట్లు, అధిక గాఢత కలిగిన స్పిరిట్లతో శుభ్రం చేసినట్టు వెల్లడించాయి. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వొద్దు: జయేశ్ రంజన్ కోవిడ్‌పై వస్తున్న వదంతులను నమ్మి వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇవ్వవద్దని ఐటీ కంపెనీలకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సూచించారు. ఒకవేళ వర్క్ ఫ్రం హోమ్‌కు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఓ మహిళా టెకీకి కోవిడ్ లక్షణాలు ఉండటంలో మైండ్‌స్పేస్‌లో కంపెనీలు మూసివేస్తున్నారని ప్రచారం జరగడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైండ్‌స్పేస్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చారని తెలిపారు. కోవిడ్ సోకిందనే అనుమానం రావడంతో ఆమె నుంచి నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్టు చెప్పారు. గురువారం ఆ నివేదిక వచ్చిన తర్వా త వివరాలు వెల్లడిస్తామన్నారు. మైండ్‌స్పేస్ 9వ అంతస్తులో ఆమెతో పాటు పనిచేస్తున్న 23 మందిని గుర్తించామని వివరించారు. అదే భవనంలోని 4వ అంతస్తులో ఆమె భర్త పనిచేస్తున్నారని, ఆయనతోపాటు మరో 65 మంది కలిసి పనిచేస్తున్నవారిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. వీరిద్దరూ పనిచేస్తున్న రెండు కంపెనీలతోపాటు అదే భవనంలో ఉన్న మరో రెండు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఇచ్చాయ న్నారు. అనుమానితులు ఉన్నా.. వైరస్ ప్రభావం కేవలం 12 గంటలే ఉంటుందని, గురువారం భార్యాభర్తలు మినహా మిగిలిన ఉద్యోగులంతా ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తారని ఆయన స్పష్టంచేశారు. మాస్క్‌లు అందించేందుకు ఇంటెల్, కాగ్నిజెంట్, వెల్స్‌ఫార్గో, టీసీఎస్, క్యాప్ జెమినీ సంస్థలు ముందుకు వచ్చాయని.. దగ్గు, జలుబు ఉన్న వారు మాత్రమే వాటిని ధరించాలని సూచించారు. ఐదు శాతం మందికే పాజిటివ్ వచ్చే ఛాన్స్... తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసు ఒక్కటి మాత్రమే నమోదైందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మైండ్‌స్పేస్‌లో పనిచేసే మహిళా టెకీ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 45 నమూనాలు నెగిటివ్‌గా వచ్చాయని.. ఇద్దరి నమూనాలను మాత్రమే పుణేకు పంపినట్టు తెలిపారు. దాదాపు 81 శాతం మందికి కోవిడ్ సోకదని, 14 శాతం మందిలో లక్షణాలు కనిపిస్తాయని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే కేవలం ఐదు శాతం మందికి మాత్రమే పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. కోవిడ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఖాళీ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బయోమెట్రిక్‌ను మార్చేశాం కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఇప్పటికే బయోమెట్రిక్ విధానంలో మార్పులు తీసుకొచ్చాం. వేలి ముద్రతో కాకుండా ఐడెంటిటీ కార్డులతోనూ బయోమెట్రిక్ పని చేస్తుంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు, రవాణా, ఇంటర్నెట్ ఇచ్చే అంశాలపై సూచనలిచ్చాం. ముందు జాగ్రత్తలపై కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నాం. – మురళి బొళ్లు, హైసియా అధ్యక్షుడు వదంతులు నమ్మొద్దు రహేజా మైండ్‌స్పేస్‌లోని భవనం నెంబర్ 20లో శానిటైజేషన్ చేశాం. ఆ భవనంలోని మొత్తం 9 కంపెనీలలో దాదాపు 7,300 మంది ఉద్యోగులు ఉన్నారు. నాలుగు కంపెనీలలో దాదాపు రెండు వేల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఒక్కరోజు అనుమతి ఇచ్చారు. కంపెనీలు ఖాళీ అవుతున్నాయనే వదంతులను ఎవరూ నమ్మవద్దు. – శ్రవణ్ గోనే, రహేజా సీఈఓ -
హ్యాపీ జర్నీ
గచ్చిబౌలి: ఎప్పటినుంచో కలగా ఉన్న మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్‌తో కలిసి శుక్రవారం వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ చిక్కులు తీరనున్నాయన్నారు. మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. నిర్ణీత సమయానికి ముందే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ మాట్లాడుతూ.. రూ.25 వేల కోట్లతో ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. 111 కి.మీ స్కైవేలు, 366 కి.మీ మేజర్ కారిడార్లు, 166 కి.మీ. మేజర్ రోడ్లు,348 కి.మీ. జంక్షన్లు, 2500 కి.మీ. మైనర్ రోడ్లు ఐదు విడతల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రూ.5 వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. వచ్చే జనవరిలో జేఎన్టీయూ, ఎల్బీనగర్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వంతెన ప్రారంభోత్సవంలో వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన, సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, అడిషనల్ డీసీపీలు అమర్ కాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇక సాపీగా రాకపోకలు.. అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్టు జీహెచ్ఎంసీ 2015లో చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇక్కడ గంటకు 14,393 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, 2035 నాటికి వాటి సంఖ్య 31,536కు పెరగనుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో ఇనార్బిట్ మాల్ నుంచి రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ జంక్షన్‌కు ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదయం సమయంలో జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలు బయోడైవర్సిటీ, రాడిసన్ హోటల్ వైపు, లెమన్ ట్రీ హోటల్ వైపు వెళ్లవచ్చు. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్, రాడిసన్ హోటల్ వైపు రాకపోకలు చేయవచ్చు. సాయంత్రం ç5 నుంచి రాత్రి 9 గంటల వరకు రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ వైపు నుంచి వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్ వైపు ఎలాంటి అటంకం లేకుండా రాకపోకలు సాగేందుకు మార్గం సులువైంది. అయితే, రాడిసన్ హోటల్ వద్ద జంక్షన్ విస్తరణ జరగకుంటే ట్రాఫిక్ కష్టాలు తప్పవు. డీఎల్ఎఫ్ వైపు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఈ జంక్షన్ వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఆరులేన్ల అండర్‌పాస్ వ్యయం రూ.25.78 కోట్లు. సర్వీస్ రోడ్లు, యుటిలిటీ డక్ట్, డ్రెయిన్ల వ్యయం రూ.28.83 కోట్లు, యుటిలిటీ షిఫ్టింగ్ వ్యయం రూ.5.92 కోట్లు. వెరసి మొత్తం ఖర్చు రూ.108.59 కోట్లు. ఎస్సార్డీపీ పనుల్లో ఇప్పటికే రూ.200 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రూ.25 వేల కోట్ల పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. -
మైండ్‌స్పేస్‌కు ఐజీబీసీ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కే రహేజా కార్ప్‌కు చెందిన మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ కమర్షియల్ బిజినెస్ పార్క్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు దక్కింది. నగరంలో గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్ దక్కించుకున్న తొలి వాణిజ్య ప్రాంగణమిదే. దేశ వ్యాప్తంగా అయితే 11వ ప్రాపర్టీ. ‘‘ప్రాంగణ ప్రణాళిక, నీరు, ఇంధన సామర్థ్యం, పర్యావరణం, నాణ్యత, ఆవిష్కరణలు ఇతరత్రా అంశాలపై 54 పాయింట్లను దక్కించుకుందని’’ కే రహేజా కార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ కాంచ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. మైండ్‌స్పేస్‌లో 3,500 చెట్లు.. మైండ్ స్పేస్ ప్రాంతం 110 ఎకరాల్లో ఉంది. ఇందులో 21 శాతం స్థలం ల్యాండ్ స్కేప్ కోసం కేటాయించారు. మొత్తం 3,500 చెట్లున్నాయి. కోటి చ.అ. బిల్టప్ ఏరియాలోని వాణిజ్య ప్రాంతంలో 21 వాణిజ్య భవనాలు, 80 వేలకు పైగా నివాసితులున్నారు. 100 శాతం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మురుగు నీటి శుద్ధి కేంద్రం, ఆన్సైట్లో 1.47 మెగావాట్లు, ఆఫ్‌సైట్‌లో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ఏర్పాట్లు వంటివి ఉన్నాయి. 45.50 మి.చ.అ.ల్లో గ్రీన్ ప్రాజెక్ట్‌లు.. ఇప్పటికే కే రహేజా కార్ప్ దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో 45.50 మిలియన్ చ.అ.ల్లో యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) అందించే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (ఎల్ఈఈడీ), ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందిన నివాస, వాణిజ్య, ఆతిథ్య భవనాలను నిర్మించింది. వీటిల్లో 29 కమర్షియల్ ప్రాజెక్ట్‌లు ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ పొందగా.. 6 ప్రాజెక్ట్‌లు ప్రీ–సర్టిఫికెట్ పొందాయి. ఐజీబీసీ నుంచి 7 నివాస ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందగా.. 4 ప్రాజెక్ట్‌లు ప్రీ–సర్టిఫికెట్ పొందాయి. -
మరింత మందికి ఉద్యోగావకాశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహణ భవిష్యత్‌లో మరింత మంది స్థానికులకు, అమెరికాలోని నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కత్రినా హడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. మైండ్ స్పేస్ భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత్, అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రధాన సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకానున్న ఈ సదస్సులో 3,000 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సైబరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 28న సాయంత్రం 5 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్‌లో 130 అమెరికా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ సదస్సు ద్వారా మరిన్ని అమెరికన్ కంపెనీలకు ఇక్కడ అవకాశాలు లభిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా భాగస్వామ్య పారిశ్రామిక వేత్తల పురోగతితోనే ప్రపంచ భద్రత సాధ్యమవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జెన్నీఫర్ అరంగ్యో అభిప్రాయపడ్డారు. సగం మందికిపైగా మహిళా పారిశ్రామిక వేత్తలు సదస్సుకు హాజరవుతుండడంతో.. ఈ ఏడాది సదస్సు నినాదాన్ని ‘‘ఉమన్ ఫస్ట్ పాస్పరిటీ ఫర్ ఆల్’’గా పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా ఆరోగ్య పరిరక్షణ, జీవశాస్త్రం, డిజిటల్ ఎకానమీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇలా నాలుగు అంశాలపై సమాంతరంగా చర్చలు జరుగుతాయన్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, పర్యావరణ వేత్తలు పాల్గొనున్న ఈ సదస్సు ఆసియా ఖండంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్టు డాక్టర్ మురళీ కృష్ణకుమార్ తెలిపారు. సదస్సులో వివిధ దేశాల నుంచి హాజరవుతున్న నిపుణులు, పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలను పంచుకునే అవకాశం ఇక్కడ లభిస్తుందన్నారు. -
జంక్షన్ జాం..