విద్యుత్ కాంతుల్లో మైండ్‌స్పేస్ ఫ్లై ఓవర్
గచ్చిబౌలి: ఎప్పటినుంచో కలగా ఉన్న మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్‌తో కలిసి శుక్రవారం వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ చిక్కులు తీరనున్నాయన్నారు. మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
నిర్ణీత సమయానికి ముందే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసిన చీఫ్ ఇంజినీర్ శ్రీధర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ మాట్లాడుతూ.. రూ.25 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామన్నారు. 111 కి.మీ స్కైవేలు, 366 కి.మీ మేజర్ కారిడార్లు, 166 కి.మీ. మేజర్ రోడ్లు,348 కి.మీ. జంక్షన్లు, 2500 కి.మీ. మైనర్ రోడ్లు ఐదు విడతల్లో అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో రూ.5 వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. వచ్చే జనవరిలో జేఎన్‌టీయూ, ఎల్‌బీనగర్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వంతెన ప్రారంభోత్సవంలో వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన, సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, అడిషనల్ డీసీపీలు అమర్ కాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇక సాపీగా రాకపోకలు..
అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ 2015లో చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇక్కడ గంటకు 14,393 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, 2035 నాటికి వాటి సంఖ్య 31,536కు పెరగనుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీంతో ఇనార్బిట్ మాల్ నుంచి రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ జంక్షన్‌కు ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదయం సమయంలో జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలు బయోడైవర్సిటీ, రాడిసన్ హోటల్ వైపు, లెమన్ ట్రీ హోటల్ వైపు వెళ్లవచ్చు. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్, రాడిసన్ హోటల్ వైపు రాకపోకలు చేయవచ్చు. సాయంత్రం ç5 నుంచి రాత్రి 9 గంటల వరకు రాడిసన్ హోటల్, బయోడైవర్సిటీ వైపు నుంచి వాహనాలు ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్ వైపు ఎలాంటి అటంకం లేకుండా రాకపోకలు సాగేందుకు మార్గం సులువైంది. అయితే, రాడిసన్ హోటల్ వద్ద జంక్షన్ విస్తరణ జరగకుంటే ట్రాఫిక్ కష్టాలు తప్పవు. డీఎల్‌ఎఫ్ వైపు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది.
ఈ జంక్షన్ వద్ద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఆరులేన్ల అండర్‌పాస్ వ్యయం రూ.25.78 కోట్లు. సర్వీస్ రోడ్లు, యుటిలిటీ డక్ట్, డ్రెయిన్ల వ్యయం రూ.28.83 కోట్లు, యుటిలిటీ షిఫ్టింగ్ వ్యయం రూ.5.92 కోట్లు. వెరసి మొత్తం ఖర్చు రూ.108.59 కోట్లు.
ఎస్సార్‌డీపీ పనుల్లో ఇప్పటికే రూ.200 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో రూ.25 వేల కోట్ల పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment