ఎల్బీనగర్‌ స్టేషన్‌ నెం.1 | More Passengers From LB Nagar Metro Station | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్‌ స్టేషన్‌ నెం.1

Published Wed, Oct 24 2018 9:18 AM | Last Updated on Mon, Nov 5 2018 1:31 PM

More Passengers From LB Nagar Metro Station - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జర్నీకి గ్రేటర్‌ సిటీజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక్క ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచే అత్యధికంగా నిత్యం 30 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రారంభమైన రూట్లలో ఈ స్టేషన్‌లో ఎక్కి..దిగే ప్రయాణికులే అత్యధికం కావడం విశేషం. ఎల్బీనగర్‌–మియాపూర్‌ మార్గంలో అత్యంత రద్దీ వేళల్లో ప్రతి 3.15 నిమిషాలకు ఒక మెట్రోరైలు నడుపుతున్నామని  హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించిన విషయం విదితమే. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ,  అదనపు సౌకర్యాలు తదితర అంశాలపై  మంగళవారం రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్‌లో హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ మార్గంలో స్థానికుల నుంచి చిన్న ఫిర్యాదులు మినహా ఎలాంటి అభ్యంతరాలు, అసౌకర్యాలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. మెట్రో జర్నీ పట్ల స్థానికులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎల్భీనగర్‌–మియాపూర్‌ మార్గంలో నిత్యం 21 రైళ్లు, నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్లో నిత్యం 12 రైళ్లు మొత్తంగా 33 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఈ రెండు మార్గాల్లోనూ రద్దీ వేళల్లో ప్రతి 3.15 నిమిషాలకో రైలును నడుపుతున్నామని..సాధారణ వేళల్లో ప్రతి ఆరున్నర నిమిషాలకో రైలును నడుపుతున్నట్లు తెలిపారు. రద్దీ అత్యల్పంగా ఉండే సమయాల్లో ప్రతి 8 నిముషాలకో  మెట్రో రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తోందన్నారు. ఎల్బీనగర్‌– మియాపూర్‌ (కారిడార్‌–1)ల  మధ్య ప్రతి రోజూ 284 ట్రిప్పులు, నాగోల్‌–అమీర్‌పేట్‌(కారిడార్‌3) రూట్లో నిత్యం 266 ట్రిప్పులు..మొత్తంగా రెండు మార్గాల్లో మొత్తం 550 ట్రిప్పుల ద్వారా  ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కెవిబి రెడ్డి తెలిపారు. 

రికార్డు స్థాయిలో మెట్రో జర్నీ..
మెట్రో కారిడార్‌–1లో ప్రతి రోజూ సరాసరిన 1.25 లక్షల మంది  ప్రయాణికులు, కారిడార్‌– 3లో 50 వేల మంది ప్రయాణిస్తున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 22న రెండు మెట్రో కారిడార్‌లలో రికార్డు స్థాయిలో 1.90 లక్షలమంది  ప్రయాణించారని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు సర్వీసులను ప్రజలు మరింత విరివిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనీల్‌ సైనీ, హైదరాబాద్‌ మెట్రో రైలు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement