కోరుట్ల/కోరుట్లరూరల్: పల్లె కన్నీరుమున్నీరైంది...మానవత్వంతో కదిలింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆ తల్లీ కొడుకుల కుటుంబానికి ఆసరాగా నిలిచింది. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో గురువారం సాయంత్రం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకొడుకుల అంత్యక్రియలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఒకే చితిపై తల్లీకొడుకుల అంత్యక్రియలు నిర్వహించగా ఆడకూతుళ్లు చితికి నిప్పంటించిన వైనం అందరినీ కలచివేసింది.
నష్టాల సాగు.. వెక్కిరించిన గల్ఫ్
వ్యవసాయంలో నష్టాలు.. వెక్కిరించిన గల్ఫ్ వలస ఫలితంగా పెరిగిన అప్పులు మారం శ్రీనివాస్‌ను ఆత్మహత్యకు పురిగోల్పాయి. 40 ఏళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా టేకుమల్ల మండలం అసిరెడ్డి పల్లె నుంచి మారం శ్రీనివాస్ కుటుంబం గుమ్లాపూర్‌కు వలస వచ్చింది. తం డ్రి వెంకట్రామ్‌రెడ్డి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో కుటుంబ భారం ఒక్కగానొక్క కొడుకు మా రం శ్రీనివాస్‌పై పడ్డాయి. అంతకు ముందే 14 ఏళ్లు గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ అక్కడ పనులు సరిగా లేక తిరిగివచ్చాడు. ఆ తరువాత తల్లి నీలమ్మ, భార్య తిరుమలతో కలిసి వరంగల్ జిల్లా చిట్యాల మండలం కొత్తపేటలో రెండు ట్రాక్టర్లు కొనుక్కుని భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయం అంతంతగానే ఉండగా ట్రాక్టర్ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆ సమయంలో దాదాపు రూ.8 లక్షల పరిహారం చెల్లించాడు. గల్ఫ్..వ్యవసాయం..ట్రాక్టర్ యాక్సిడెంట్ ఇలా ఎటు నుంచి చూసినా శ్రీనివాస్‌ను నష్టాలే వెక్కిరించాయి. ఆ నష్టాలు పూడ్చుకోవడానికి గుమ్లాపూర్‌తోపాటు కొత్తపేటలోనూ అప్పులు చేశాడు. అవి దాదాపు రూ.25 లక్షలకు చేరుకున్నాయి.
పెరిగిన ఒత్తిడి..
నాలుగు నెలల క్రితం వరకు టేకుమల్ల మండలం కొత్తపేటలో ఉన్న మారం శ్రీనివాస్ కుటుంబం అక్కడ అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిపోవడంతో కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో సొంతింటిలో ఉంటున్న తల్లి నీలమ్మ వద్దకు వచ్చి ఉంటున్నాడు. కొత్తపేట నుంచి వచ్చినప్పటికీ గుమ్లాపూర్‌లో అప్పులు ఉండటంతో శ్రీనివాస్ సతమతమయ్యాడు. స్థానికంగా అప్పుల ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని అప్పుల కింద రూ.17 లక్షలకు అప్పగించాడు. ఈ క్రమంలో తల్లి నీలమ్మతో గొడవలు జరిగినట్లు సమాచారం. గుమ్లాపూర్‌లో ఇల్లు అమ్మి అప్పులు కడుతున్నాడన్న విషయం తెలుసుకున్న కొత్తపేటకు చెందిన వ్యక్తులు తమ బాకీ వసూలుకు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. మరోమార్గం లేక శ్రీనివాస్ ఆత్మహత్యకు నిర్ణయించుకున్నాడు.
ఇంటిపై మమకారం..
40 ఏళ్లుగా నీడనిచ్చిన ఇంటిని అమ్మే విషయంలో మారం శ్రీనివాస్‌కు, తల్లి నీలమ్మకు కొంత మేర విభేదాలు వచ్చినప్పటికీ కొడుకు పరిస్థితిని చూసి చివరికి ఇల్లు అమ్మేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అప్పుల బాధతో వేగలేక చావడానికి నిశ్చయించుకున్న శ్రీనివాస్ తను లేకుంటే అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునే వారు ఎవరూ ఉండరని తీవ్రవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తల్లితోపాటు తాను విషం తీసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. గురువారం భార్య తిరుమల బట్టల షాపులో పనికి కోరుట్లకు వెళ్లిపోగానే పురుగుల మందును అందుబాటులో ఉంచుకున్న శ్రీనివాస్ సాయంత్రం తన కూతుళ్లు కీర్తన, ఐశ్వర్యలు ఇంటికి రాగానే వారిని ఏమైనా కొనుక్కొమని చెప్పి షాప్‌కు పంపినట్లు తెలిసింది. పిల్లలు బయటకు వెళ్లగానే తల్లి నీలమ్మకు విషం ఇచ్చి తాను తాగి దూలానికి ఉరి వేసుకున్నాడు.
గ్రామస్తుల మానవత్వం..
అప్పుల బాధతో తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో గుమ్లాపూర్‌లో విషాదం నెలకొంది. భార్య తిరుమల, కూతుళ్లు కీర్తన, ఐశ్వర్యలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా గ్రామస్తులు అంత్యక్రియల కోసం రూ.38 వేలు చందాలు వేసుకున్నారు. టేకుమల్ల మం డలం అసిరెడ్డిపల్లి నుంచి మారం శ్రీనివాస్ అత్తగారి తరçపున బంధువులు రాగానే గ్రామస్తులు అంతా కలిసి శ్రీనివాస్, నీలమ్మ మృతదేహాలను ట్రాక్టర్‌లో ఎక్కించి శ్మశానానికి తరలించారు. ఒకే చితిపై తల్లీకొడుకుల మృతదేహలను ఉంచగా శ్రీనివాస్ భార్య తిరుమల, కూ తురు కీర్తన చితికి నిప్పు పెట్టారు. ఈ దయనీయ పరిస్థితి అందరినీ కన్నీరుపెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment