
తల్లి లక్ష్మీమృతదేహం వద్ద విలపిస్తున్న లావణ్య , లక్ష్మీ(ఫైల్)
పెద్దపల్లి, జ్యోతినగర్(రామగుండం) : అమ్మా..నన్ను విడిచి పోయావా..నేను ఎలా బతకాలి..నాన్న ఎటు పోయాడో తెలియదు. నాకు అన్నీ నీవై పెంచావు..ఇప్పుడు అనాథను చేసి నన్ను వదిలి వెళ్లిపోతున్నావా అమ్మా... అని తల్లి లక్ష్మీ(37) మృతదేహం వద్ద రోదిస్తున్న లావణ్యను చూసి కాలనీవాసులు కన్నీరుకార్చారు. ఈ విషాదకర సంఘటన జ్యోతినగర్‌లో చోటు చేసుకుంది.æ ఎన్టీపీసీ రామగుండం సుభాష్‌నగర్‌కు చెందిన అక్కపాక లక్ష్మీ–మల్లయ్య దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో లావణ్య జన్మించింది.
లక్ష్మీ భర్త మల్లయ్య ఏడేళ్లక్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నేటికి ఆచూకీ లేదు. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయినా లక్ష్మీ(37) కూలీ పనులు చేసుకుంటూ కూతురు లావణ్యను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. లావణ్య జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. కూలీ పనులు చేసుకుంటున్న లక్ష్మీ అనారోగ్యం పాలైంది. సమయానికి సరైన వైద్యచికిత్స అందకపోవడంతో కామెర్లు సోకి సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. లక్ష్మీ కూతురు లావణ్య రోదనలు మిన్నంటాయి. లావణ్యను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.