ఆమె ఒక నటి. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ. అయితేనేం సమాజానికి తనవంతు సహాయం చేయాలనుకున్నారు. ‘రమ్య హృదయాలయ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి.. అనాథలు, యాచకులు, వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ఆమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ.
విశాఖపట్టణానికి చెందిన సుజాత అలియాస్ రమ్యశ్రీ 1997లో హైదరాబాద్‌కు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు 8 భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. నటి, డ్యాన్సర్, దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో స్వీయ దర్శకత్వంతో తాను నటించిన ‘ఓ మల్లీ’ చిత్రం జ్యూరీ విభాగంలో బెస్ట్ దర్శకురాలిగా నంది అవార్డు గెలుచుకొంది. ఇదంతా ఒకవైపు.. మరోవైపు ఆమె సేవా హృదయురాలు. చిన్నప్పటి నుంచి యాచకులను చూసి చలించిపోయేది. ఇంట్లో తెలియకుండా వారి వద్దకు వెళ్లి దుస్తులు, డబ్బులు ఇచ్చేది. అలా మొదలైన సేవ.. నేటికీ కొనసాగుతోంది.
అవసరాలు తీరుస్తూ...
రోడ్డుపై యాచకులు కనిపిస్తే చాలు.. రమ్యశ్రీ కారు ఆగిపోతుంది. వారి దగ్గరికి వెళ్లి అవసరాలు తెలుసుకుంటుంది. షూటింగ్ లేని రోజుల్లో వారుండే ప్రాంతానికి వెళ్లి దుస్తులు, దుప్పట్లు, డబ్బులు అందజేస్తుంది. భోజనం కూడా తీసుకెళ్లి ఇస్తుంది. రమ్యశ్రీ సేవలను గుర్తించిన హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల ఆమెకు ‘మదర్ థెరిస్సా’ అవార్డు ప్రదానం చేసింది.
పిల్లల దత్తత.. వృద్ధుల బాధ్యత
రమ్యశ్రీ ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆరుగురు వృద్ధుల ఆలనాపాలన చూసుకుంటున్నారు. పిల్లల్లో ఒకరు ఆరో తరగతి, మరొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ప్రయోజకులు అయ్యే వరకు తన బాధ్యతేనని చెప్పారు రమ్యశ్రీ.
ఆదుకోవాలి..
అనాథలకు ఎన్నో ఆశలు, కోర్కెలు ఉంటాయి. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సహకరించాలి. వారి కలల్ని సాకారం చేయాలనేది నా లక్ష్యం. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నాను. – రమ్యశ్రీ, నటి
Comments
Please login to add a commentAdd a comment