
తెలంగాణలో టీడీపీ అంతరించి పోయింది.
సాక్షి, హైదరాబాద్ : సామాన్యులను మంత్రులను చేసిన ఘనత నందమూరి తారక రామారావుదని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మహనీయుడు, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఒక వ్యవస్థను సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
మోత్కుపల్లి మాట్లాడుతూ.. 'సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆధ్యుడు. రాజకీయంగా చైతన్యం కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పథకాలనే నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. టీడీపీని టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని అంటే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏమైంది. దీనికి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారు. ఎన్టీఆర్ ఆశయాల బాటలో నడుస్తున్నా. టీఆర్‌ఎస్‌తో టీడీపీ కలిసి ఉంటే బాగుండేది. తెలంగాణలో టీడీపీ అంతరించి పోయింది. ఎన్టీఆర్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మర్చిపోరు' అని అన్నారు.