టీడీపీకి అచ్చిరాని తంబళ్లపల్లె! | Thamballapalle Assembly Election 2024 | Sakshi
Sakshi News home page

టీడీపీకి అచ్చిరాని తంబళ్లపల్లె!

Published Sun, Apr 14 2024 8:32 AM | Last Updated on Sun, Apr 14 2024 9:59 AM

Thamballapalle Assembly Election 2024 - Sakshi

ఎన్టీఆర్ ప్రభంజనంలో 1983లో ఘోర ఓటమి 

1999, 2004లో పోటీకి టీడీపీ దూరం 

లక్ష్మి దేవమ్మ తప్ప మరొకరు రెండోసారి గెలవని వైనం 

టీడీపీలో అవమానకరంగా ముగిసిన శంకర్‌ శకం  

బి.కొత్తకోట: తెలుగుదేశం పార్టీకి తంబళ్లపల్లె అచ్చిరావడం లేదా.. పోటీచేసిన నేతలకు కష్టాలు తప్పవా?. రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందా? జరిగిన ఘటనలు, జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే అవుననే చెప్పాలి. టీడీపీ టికెట్‌పై పోటీ చేశాక ఎవరి భవిష్యత్త ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. టీడీపీ చరిత్రలో అనిపిరెడ్డి కుటుంబం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా సారధ్య బాధ్యతలను నిర్వర్తించింది. పార్టీకి గట్టి పునాదులు వేసింది. ప్రస్తుతం ఈ కుటుంబం రాజకీయాలకు దూరమైంది. బీసీ నేత శంకర్‌ను టీడీపీలోకి రప్పించుకుని వాడుకున్నఅధిష్టానం గెంటేసినంత పనిచేసింది. కొత్త వ్యక్తికి టికెట్‌ ప్రకటించిన చంద్రబాబు, ఆ వ్యక్తి ప్రచారంలో ఉండగానే పొత్తులో తంబళ్లపల్లెను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో తంబళ్లపల్లెలో టీడీపీ తరపున పనిచేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. 

ఎన్టీఆర్ ప్రభంజనంలో పరాజయం 
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాయనే చెప్పొచ్చు. అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవగా తంబళ్లపల్లెలో పరాజయం పాలైంది. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఏవీ ఉమాశంకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆవుల మోహన్‌రెడ్డి బరిలో నిలవగా, ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి టీఎన్‌.శ్రీనివాసులురెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఇద్దరు అభ్యర్థులను ఓడించారు. 

టీడీపీకి పునాది ఉమాశంకర్‌రెడ్డి 
టీడీపీ తరపున తంబళ్లపల్లె రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉమాశంకర్‌రెడ్డిది ములకలచెరువు మండలంలోని గూడుపల్లె. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైనప్పటికి ఎన్టీఆర్‌ ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో కీలకవ్యక్తిగా మారుతున్న సమయంలో 1984 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండగా తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె వద్ద దారుణహత్యకు గురయ్యారు. 

తెరపైకి లక్ష్మిదేవమ్మ  
భర్త ఉమాశంకర్‌రెడ్డి హత్యతో గృహిణిగా ఉన్న లక్ష్మీదేవమ్మ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 1989 ఎన్నికలో ఓడిపోగా 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి టీఎన్, కలిచర్ల కుటుంబాలపై పైచేయి సాధించడం అప్పట్లో సంచలనం. అయితే బీజేపీ రూపంలో ఆమె రాజకీయ ప్రస్థానానికి బ్రేక్‌ పడింది. టీడీపీ–బీజేపీ పొత్తుతో తంబళ్లపల్లె స్థానం 1999, 2004లో బీజేపీకి ఇవ్వడంతో పోటీకి దూరమయ్యారు. 2004 ఎన్నికలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాక అవే ఆమెకు చివరి ఎన్నికలు.   

ఐదేళ్లు గడవకనే అనర్హత  
తండ్రి ఉమాశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా, తల్లి లక్ష్మి దేవమ్మ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయగా వీరి కుమారుడు ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగలేకపోగా 10 ఏళ్లుగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రవీణ్‌ 2009 ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేసి టీడీపీ అభ్యరి్థగా పోటిచేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరడం, చంద్రబాబు విభజనకు లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తవకనే అనర్హత వేటు వేసింది. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యరి్థగా పోటీచేసి ఓటమిపాలై రాజకీయాలకు దూర మయ్యారు. 

మెరిసి మసకబారిన శంకర్‌ 
2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా  బరిలో దిగిన జి.శంకర్‌ యాదవ్‌..ప్రవీణ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాత బెంగళూరులో వ్యాపారాలతో స్థిరపడ్డారు. 2014లో టీడీపీ తరపున పోటీచేసేందుకు అభ్యర్థి దొరకని పరిస్థితిలో శంకర్‌ను టీడీపీ నేతలు ఒప్పించి పోటీ చేయించగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు శంకర్‌ పోరాటమే చేయాల్సి వచ్చింది. చివరకు టికెట్‌ ఇచ్చినా ఓడిపోయారు. 2024లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా ఊహించని విధంగా శంకర్‌ను కాదని రాజకీయాలకు కొత్త వ్యక్తి అయిన జయచంద్రారెడ్డికి టికెట్‌ కేటాయించడంతో టీడీపీలో శంకర్‌ ఎపిసోడ్‌ ముగిసింది.  

కొత్త అభ్యర్థి మూన్నాళ్ల ముచ్చట 
ఊహించని విధంగా టీడీపీ టికెట్‌ దక్కించుకున్న జయచంద్రారెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఫిబ్రవరి 24న టికెట్‌ ప్రకటించగా, అప్పటినుంచి పోటీచేసేది నేనే అంటూ ప్రచారం చేసుకున్నారు. అభ్యరి్థత్వ ప్రకటన వెలువడిన రోజునుంచే టీడీపీ క్యాడర్‌ ఆయనకు వ్యతిరేకమైంది. క్యాడర్‌కు కొత్త కావడం, పరిచయాలు లేకపోవడం, మాజీ ఎమ్మెల్యే శంకర్, సీనియర్‌ నేతల వ్యతిరేకతతో ఇన్నాళ్లు గడచిపోగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తులో టికెట్‌ బీజేపీకి కేటాయించే పరిస్థితి వచ్చింది. ఇదంతా టీడీపీకి తంబళ్లపల్లె అచ్చిరాకపోడమే అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement