నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
హసన్ పర్తి: సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని.. వీటిని విద్యార్థినులు అందిపుచ్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సూచించారు. విద్యాసంస్థలు-పరిశ్రమల నడుమ అంతరాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్‌లో రాణించడం సులువవుతుందని ఆమె అన్నారు. వరంగల్ నగర శివారు అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్‌టీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్ ్స అండ్ టెక్నాలజీ) ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన ఉమెన్ ్స టెక్నాలజీ పార్క్‌ను శనివారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సాంకేతిక విద్యపై ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ చూపకపోవడంతో పదిహేనేళ్లుగా అదే సిలబస్ కొనసాగుతోందన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఫైనలియర్‌కు వచ్చాక ఉద్యోగాల కోసం ప్రయత్నించడం కంటే.. ఫస్టియర్ నుంచే భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటే ఫలితముంటుందని కవిత తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలకు పార్క్‌లో వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్పిస్తారని, ఇందుకు కావాల్సిన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కవిత తెలిపారు. తెలంగాణ విమోచనకు ఎందరో పోరాడి ప్రాణాలర్పించారని, వారందరికీ నివాళులర్పిస్తున్నానని ఎంపీ కవిత తెలిపారు.
నిజామాబాద్‌కు అన్యాయం చేసిన సీఎం కేసీఆర్
టెక్స్‌టైల్ పార్క్ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజామాబాద్‌కు అన్యాయం చేశారని ఎంపీ కవిత పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని తాను సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తే.. ఆయన సున్నితంగా తిరస్కరించి.. వరంగల్‌లో ఏర్పాటు చేస్తే మంచిదని సమాధానం చెప్పారన్నారు. అరుుతే, ఎక్కడ నిర్మించినా తెలంగాణ అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కవిత అన్నారు.
కేంద్రమంత్రిగా కవితకు అన్ని అర్హతలు..
కేంద్రమంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు కవితకు ఉన్నాయని, ఆమె ఆ బాధ్యతలు స్వీకరించాలని అందరం ఎదురుచూస్తున్నామని ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు.