పాఠశాలలను బాగుచేయండి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఎంపీ కవిత, ఎమ్మెల్యేల వినతి
సానుకూలంగా స్పందించిన మంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ను పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గురువారం సచివాలయంలో కడియం శ్రీహరితో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, కాలేజీల పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిపై కడియం సానుకూలంగా స్పందించారు.
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్‌ను పిలిచి సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, తమ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయాలని వారు కడియంను కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు.
పాఠశాలలు, కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తాము ఏ గ్రామానికి వెళ్లినా ఇంగ్లిషు మీడియం పాఠశాలలకు అనుమతులు ఇప్పించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉందని ఎంపీ, ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరి చేసి కొంత వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఎంపీ కవిత కోరారు.
సమస్యలు పరిష్కరిస్తాం..
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల పటిష్టత కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కలసి రావడంపై కడియం హర్షం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంలో ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, కాలేజీల్లో ఎన్‌సీసీని తప్పనిసరి చేసే అంశాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నామని కడియం చెప్పారు.