భూపాల్‌పల్లి (వరంగల్): తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి.. ఆపై చదివిన బాలికల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలోని మంజూర్‌నగర్‌లో సోమవారం సింగరేణి చేపట్టిన హరితహారం కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారితోపాటు శ్రీహరి హాజరై మాట్లాడారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆడపిల్లలకు మెరుగైన విద్యను అందించటం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. ఇప్పటివరకు కస్తూర్బా విద్యాలయాల్లో పదో తరగతి చదువుకుంటున్న బాలికలకు ఆవాసం కల్పించి విద్యను అందజేస్తున్నామని... సీఎం ఆదేశాలతో ఇంటర్, డిగ్రీ చదువుకునే బాలికలకు సైతం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు.