
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న తలపెట్టిన బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. ఆదివారం సికింద్రాబాద్ పార్శిగుట్టలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 24 ఏళ్ల తమ ఉద్యమ పోరాటంలో బంద్‌ను వాయిదా వేయడం ఇదే తొలిసారని అన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేని రోజునే బంద్ నిర్వహిస్తామని చెప్పారు. 13న బంద్‌కు బదులుగా జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళనలు చేపడతామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని అన్నారు. రాజ్యసభలో వర్గీకరణ కోసం రాహుల్‌గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షంపై సీఎం కేసీఆర్, మంత్రి కడియం ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలని మంద కృష్ణ మాదిగ కోరారు. హత్యకుట్రపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.