
టీడీపీలోకి ముకేశ్ గౌడ్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మూల ముకేశ్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఆయన బుధవారం రాజ్యసభ సభ్యుడు, తన సమీప బంధువైన టి.దేవేందర్ గౌడ్‌తో కలసి టీడీపీ అధ్యక్షుడు బాబును కలిశారు. సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ముకేశ్ చేసిన విజ్ఞప్తికి బాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అదే జరిగితే.. వియ్యంకుల మధ్యే పోటీ
ముకేశ్ గౌడ్ సోదరుని కుమార్తెను, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు వివాహం చేసుకోవడంతో వరుసకు వారిద్దరూ వియ్యం కులు అవుతారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఎన్నిక అనివార్యం. ఈసారి తలసాని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా, టీడీపీ తరఫున ముకేశ్‌గౌడ్ బరిలో దిగితే వీరి మధ్య పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సనత్‌నగర్ బరిలో టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు కూన వెంకటేశ్ గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు.