ఎన్నికల హామీలు నెరవేర్చాలి
బెల్లంపల్లి : సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ వై.గట్టయ్య డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం ప్రధాన ద్వారం ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందాలను అమలు చేయడంలో సింగరేణి తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
హైపవర్ కమిటీ సూచించిన ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.15 వేల వేతనం చెల్లించకుండా దగా చేస్తోందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగే వరకు సింగరేణి వ్యాప్తంగా పోరాటాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, ఉపాధ్యక్షులు దాగం మల్లేశ్, కోశాధికారి టి.మల్లయ్య , ఆర్గనైజింగ్ కార్యదర్శి రత్నం రాజం, జిల్లా సీనియర్ నాయకులు సి.హెచ్.నర్సయ్య, పి.బానుదాసు, సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.