
‘ముత్తూట్’లో భారీ చోరీ
ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్ ఫైనాన్స్ చోరీని నిశితంగా గమనిస్తే దొంగలు ముందే రెక్కీ చేసినట్లుగా తెలుస్తోంది.
3.5 కిలోల నగలు.. రూ.లక్ష నగ దు కాజేసిన దుండగులు
పట్టపగలు.. మహానగరానికి అతి సమీపంలో ఉన్న రామచంద్రాపురంలో దొంగలు తెగబడ్డారు. ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్స్ ఫైనాన్స్‌ను లూటీ చేశారు. కత్తులతో ఫైనాన్స్ కార్యాలయంలోకిచొరబడిన ఐదుగురు దొంగలు.. సిబ్బందిని లాకర్ రూంలో బంధించి 3.5 కిలోల బంగారు నగలు, రూ లక్ష నగదు దోచుకుని వెళ్లారు. వె ళ్తూ..వెళ్తూ.. సీసీ కెమెరాల దృశ్యాలు నిక్షిప్తమై ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రామచంద్రాపురం పరిధిలోని బీరంగూడ జాతీయ రహదారి వద్ద జరిగింది.
ప్లాన్ ప్రకారం పని పూర్తి చేసిన దుండగులు
20 నిమిషాల్లో ఘరానా చోరీ
రామచంద్రాపురం/పటాన్‌చెరు : ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్ ఫైనాన్స్ చోరీని నిశితంగా గమనిస్తే దొంగలు ముందే రెక్కీ చేసినట్లుగా తెలుస్తోంది. వారు లోపలకు వచ్చీరావడంతోనే సీసీ కెమెరాలతో పాటు ముఖద్వారం వద్ద ఉన్న అలారం వైర్లను కట్‌చేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. దీనికితోడు సీసీ కెమెరా రికార్డు చేసే హార్డ్ డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లారంటే.. పక్కా ప్రణాళికతోనే దుండగులు రంగంలోకి తిగినట్లు స్పష్టమవుతోందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చోరీ చేసిన దుండగులు కేవలం 20 నిమిషాల్లోనే పని పూర్తి చేశారంటే కచ్చితంగా ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు.
సంఘటన స్థలానికి వచ్చిన క్లూస్‌టీం...
దోపిడీ జరిగిన స్థలాన్ని క్లూస్ టీం సందర్శించింది. లాకర్ గదిలో దుండగులు వదిలిన పలు బట్ట పీలికలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సైతం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. దుండగులు వదిలి వెళ్లిన బట్ట పీలికల వాసన చూసిన జాగిలం జాతీయ రహదారిపై తిరిగింది. అనంతరం సబ్‌స్టేషన్‌ను ఆనుకొని ఉన్న టీ దుకాణం వద్దకు వెళ్లి ఆగింది.
సవాలుగా మారిన ‘మూత్తూట్’ దోపిడీ
పటాన్‌చెరు/రామచంద్రాపురం: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ పోలీసులకు సవాలుగా నిలిచింది. విషయం దావానలంలా వ్యాపించడంతో పోలీసు అధికారులు, రాష్ట్ర స్థాయి ఐజీలు సంఘటన స్థలానికి వచ్చారు. ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, ఎస్పీ సుమతి గంటల తరబడి పరిశీలన జరిపారు. డీఐజీ, ఐజీలు మధ్యాహ్నం రెండు గంటల పాటు ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో గడిపారు. ఎస్పీ సుమతి ఇతర అధికారులు సాయంత్రం వరకు సంఘటన స్థలంలో ఉండి పరిశోధన చేశారు.
ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన స్వీపర్ హేమను పోలీసులు చాలాసేపు విచారించారు. దుండగుల వయస్సు, వారు మాట్లాడిన తీరు ఇతర వివరాలను ఆమెనుంచి రాబట్టారు. హేమ మంగళవారం రాత్రి పూట భోజనం చేయలేదని ఆమె తల్లి పోలీసులకు వివరించినా.. వదలకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని ఆమె నుంచి అడిగి తెలుసుకున్నారు. ఫైనాన్స్ సంస్థ ఉన్న భవంతి యజమాని, ఇతర సాక్షులను విచారించారు.
సంగారెడ్డి నుంచి క్లూస్ టీం, జాగిలంతో సంఘటన స్థలంలో పరిశోధన చేసినా.. బుధవారం రాత్రి వరకు ఎలాంటి ఆధారాలు లభించక పోవడం పోలీసులకు సవాలుగా మారింది. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని చెబుతున్నప్పటికీ వివరాలేవీ కనుక్కోలేకపోయారు. ఇది.. ఇంటి దొంగల పని.. అయి ఉంటుందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోలీసులు అధికారులు సంఘటన స్థలానికి రావడం బట్టి పోలీసులు ఈ కేసును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనేది తేటతెల్లమవుతోంది.
ఆందోళనలో బాధితులు...
పటాన్‌చెరు: ముత్తూట్ మినీ ఫైనాన్స్ సంస్థలో దోపిడీ దొంగతనం జరగడంతో ఆ సంస్థ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ సంఘటన వివరాలు తెలుసుకున్న బాధితులు ఆ సంస్థ వద్దకు వచ్చి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తమ బాధను పోలీసుల ముందు చెప్పుకున్నారు.
వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రామచంద్రాపురం డీఎస్పీ సురేందర్‌రెడ్డి తెలిపారు. అయితే దొంగలను పట్టుకుంటామని, సొత్తు రికవరీ చేస్తామని ఎస్పీ సుమతి కూడ వినియోగదారులకు భరోసా ఇచ్చారు. దోపిడీకి గురైన సొత్తుకు సంస్థ తరఫున ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఖాతాదారులకు ఆందోళన అవసరం లేదని తెలిపారు.