తెలంగాణ ప్రజలను దగా చేస్తున్న కేసీఆర్
టీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడొద్దని మా బీజేపీ వాళ్లకు చెప్పా: నాగం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో నీటి ప్రాజెక్టులపై జరిగిన ఒప్పందంతో తెలంగాణ అంతా సస్యశ్యామలమై కోటి ఎకరాలకు సాగునీరు వస్తుందని సీఎం కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని బచావో తెలంగాణ మిషన్ అధ్యక్షుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2012 మే 5న ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి ఒప్పందం జరిగిందన్నారు. అప్పటి ఒప్పందానికి, ఇప్పటి కేసీఆర్ ఒప్పందానికి తేడా ఏమీ లేదన్నారు.
ఇప్పటికే నడుస్తున్న 33 పథకాలను నిర్వీర్యం చేస్తూ కాంట్రాక్టర్ల కోసం తన అధికారాన్ని సీఎం దుర్వినియోగం చేస్తున్నారని, రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ప్రజలపై రూ.25 వేల కోట్ల భారం మోపేందుకు తతంగం నడుపుతున్నారని విమర్శించారు. ‘మహారాష్ట్రతో ఒప్పందం పేరుతో చేసిన ప్రచారంతో మా బీజేపీ నేతలు కూడా గొప్పగా చెప్పి, హడావుడి చేశారు. కేసీఆర్ ట్రాప్‌లో పడొద్దని బీజేపీ నాయకులకు హితవు చెప్పిన. ఈ ఒప్పందాల వివరాలన్నీ బీజేపీ వాళ్లకు పంపిస్తా’ అని నాగం వ్యాఖ్యానించారు. ‘పుర ఎన్నికలు ఆయనకే (కేసీఆర్‌కు) విడిచిపెడతాం. పోటీ చేయవద్దని అన్ని పార్టీలకు చెప్పిన. అయినా వినలేదు’ అన్నారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టులను పూర్తిచేస్తే తాను కేసీఆర్‌కు తలవంచి, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. లేనిపక్షంలో ఎన్నికల్లో పోటీచేయను అని సీఎం చెప్పగలడా? అని నాగం సవాల్ విసిరారు.