సాక్షి, రంగారెడ్డి జిల్లా : నాగార్జున సాగర్ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత గాల్లోదీపంగా మారింది. పదికాలాలపాటు మన్నికగా ఉండాల్సిన రహదారి నిర్మాణం.. చిన్న వానకే చెదిరిపోతోంది. బొంగ్లూర్ ఔటర్ రింగురోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వరకున్న నాగార్జునసాగర్ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.29 కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు 7.6 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గతేడాది మార్చిలో పనులు మొదలయ్యాయి.
ఇందులో కీలకమైన ఇబ్రహీంపట్నం చెరువుకట్ట, మంగల్‌పల్లి వంతెన పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అయితే ఈ పనుల్లో నాణ్యత మాయమవ్వడంతో భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనులు అస్తవ్యస్తమవుతున్నాయి.
చెదిరి ‘చెరువు’లోకి..
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టను నాలుగు లైన్లుగా మార్చేందుకు కొంత భాగాన్ని కట్టకు సమానంగా చేస్తూ.. మరికొంత భాగం కట్ట కింద రోడ్డు వేస్తున్నారు. అయితే కట్టకు సమానంగా చేసే క్రమంలో దాదాపు 40 అడుగుల ఎత్తులో మట్టి వేసి చదును చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే గతవారం చివర్లో కురిసిన వర్షానికి ఈ మట్టి కాస్త కిందికి కొట్టుకుపోతోంది. వాస్తవానికి అంత ఎత్తులో కేవలం మట్టితోనే రోడ్డు నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
సాధారణంగా రోడ్డు ఎత్తు పెంచే క్రమంలో ఇక్కడ కొంత భాగం మట్టితో.. ఆ తర్వాత మెటల్‌తో నింపి మరికొంత భాగాన్ని మట్టి వేసి నిర్మిస్తారు. కానీ ఇక్కడ మొత్తం మట్టినే నింపుతూ పనులు పూర్తిచేస్తున్నారు. దీంతో గత వారం ఒక్కసారిగా కురిసిన వానకు మట్టంతా చెదిరి చెరువులోకి చేరింది. ప్రస్తుతం నీరులే కపోవడంతో పనులు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. చెరువులోకి నీరు చేరితే.. అలల తాకిడికి మట్టి కొట్టుకొచ్చే అవకాశం ఎక్కువ. ఇదిలాఉంటే రోడ్డు విస్తరణ పనుల్లో లోపాలు లేకుండా పక్కాగా నిర్మాణం పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ సహాయ ఇంజినీరు వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.
రూ.కోట్లు కొట్టుకుపోతున్నాయ్!
Published Tue, Oct 13 2015 2:06 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement