సూర్యాపేట : తెలంగాణ పోరాటాల గడ్డలో వచ్చే మూడేళ్లలో ఏ పార్టీ అడ్రస్ ఉండదని, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపునకు సోమవారం సూర్యాపేటలోని త్రివేణి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో చదువుకునే వారు అభిప్రాయమేమిటో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించి నిరూపించుకోవాలన్నారు. తొమ్మిది నెలల పాలనలో టీఆర్‌ఎస్ చేసిన కార్యక్రమాలు మాటలకందనివన్నారు. రాష్ర్టం ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హిందూ,ముస్లింల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతాయని గిట్టని వాళ్లు ఏవేవో కారుకూతలు కూశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక శాంతిభద్రతలకు ఎక్కడా కూడా విఘాతానికి చోటు లేకుండా బతుకమ్మ, బోనాలు, వినాయక నిమజ్జనం, రంజాన్ పండగలను వైభవంగా జరిపామన్నారు.
టీడీపీ.. ఆంద్రోళ్ల పార్టీ అని, తెలంగాణలో ఆ పార్టీకి బతుకు దెరువు లేదని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం నల్లగొండ జిల్లాకే పరిమితమైందని, మిగతా తొమ్మిది జిల్లాలో ఎక్కడా కూడా నామరూపాల్లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లను నామ రూపం లేకుండా చేయాలంటే పల్లా గెలుపుతోనే తేటతెల్లమవుతుందన్నారు. బీజేపీలో ముగ్గురు నలుగురు ఉన్నారని, నిన్నగాక మొన్ననే ఒకాయన బీజేపిని పొరకపట్టి ఊడ్చేశారన్నారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎంత తిడితే అంత పెద్దపదవి వస్తుందనే భ్రమలో ఉండి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం చివరి క్షణం వరకు పట్టభద్రులు కృషి సల్పాలని పిలుపునిచ్చారు.
కేసీర ప్రభుత్వ పాలనకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు రెఫరెండంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన జిల్లా ముద్దుబిడ్డ కొండేటి వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రాణత్యాగం చేస్తే అక్కడ నుంచి ఆయనమృతదేహాన్ని స్వగ్రామం దోసపహాడ్ గ్రామానికి తీసుకొచ్చేందుకు రాజేశ్వర్‌రెడ్డి చేసిన కృషి అంతా ఇంతా కాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, బద్దం అశోక్‌రెడ్డితో పాటు ఆయా సంఘాల ప్రతినిధులు, పట్టభద్రులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పోరాటాల గడ్డలో ఏ పార్టీ అడ్రస్ ఉండదు
Published Mon, Mar 9 2015 11:57 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement