సీఎం కుమారుడే రెచ్చగొట్టే మాటలా?
కేటీఆర్ మాటలను ఖండించిన ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రతినిధులే ప్రజలను రెచ్చగొట్టడం తీవ్రమైన చర్యగా భావించాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతూ డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని ఉద్భోదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి కుమారుడే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎలా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విద్వేషాలను రెచ్చగొట్టడం తీవ్రమైన నేరమన్నారు.
దాడి చేసిన వారి కంటే చేయమని చెప్పినవారే చట్టం దృష్టిలో మొదటి నేరస్థులని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిపై ఎవరు ప్రశ్నించినా అభివృద్ధికి అడ్డం వస్తున్నారని అధికారపార్టీ ఎదురుదాడి చేస్తున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. కేంద్రం సబ్సిడీలతో ట్రాక్టర్లను అందిస్తే వాటిని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు అందించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు బీజేపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.