నామా నాగేశ్వరరావు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న మాజీ ఎంపీ, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు రాజకీయ గమ్యం ఎటువైపన్న అంశంపై మాత్రం ఇంకా అనిశ్చితే కొనసాగుతోంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీచేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఉభయ జిల్లాల్లో పోటీ చేసిన మూడు స్థానాల్లో రెండు గెలుపొందగా..నామా మాత్రమే ఆ ఎన్నికల్లో ఓడారు. ఇక కాంగ్రెస్ సైతం తాను పోటీచేసిన ఆరు స్థానాల్లో విజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాకూటమి మెజారిటీ స్థానాలను గెలుపొందినట్లయింది. శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో సంభవిస్తున్నపెను మార్పులకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించుకోవాలని భావించిన నామా గత కొంతకాలంగా ప్రధాన రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆయన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నారని, టీఆర్‌ఎస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు దృష్టి సారించారని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆయా పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే ఘడియ ముంచుకొస్తుండటంతో రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై నామా నాగేశ్వరరావు శుక్రవారం టీడీపీలోని ముఖ్య నేతలు, అనుచరులతో హైదరాబాద్‌లోని మధుకాన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి..సుదీర్ఘ సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
ఈ సమావేశానికి టీడీపీకి చెందిన ముఖ్యనేతలతోపాటు మరికొందరు నాయకులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే అశ్వారావుపేట టీడీపీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావును ఈ సమావేశానికి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేనప్పుడు పార్టీ మారే సమావేశాలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న భావనతో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సమావేశంలో భిన్నాభిప్రాయాలు..
నామా కాంగ్రెస్‌లో చేరినా టీడీపీతో పొత్తు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా పార్టీ మారడం వల్ల ఉపయోగం ఏముంటుందన్న భావనతో మరికొందరు సీనియర్ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) హాజరు కాలేదు. అలాగే మద్దినేని బేబి స్వర్ణకుమారి వంటి సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొనలేదు. హాజరైన వారి మధ్య మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నామా ఏ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు.. ఇందులో పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌లో చేరడానికి సానుకూల పరిస్థితులు లేవన్న అంశంపై సైతం సమావేశంలో చర్చ జరగ్గా.. అలాంటిదేమీ లేదని ఆ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని, బయట జరుగుతున్న ప్రచారాలకు, అంతర్గత పరిస్థితికి అత్యంత వ్యత్యాసం ఉందని నామా సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ వైపు చూడటం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు నేతలు వాదించగా.. కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆదరించినా.. ఖమ్మం వంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలుపు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాలనుకున్న సమయంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీకి మూడు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారని, టీడీపీకి రెండు నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఉన్నారని, ఏడు నియోజకవర్గాల్లో.. ఐదు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీచేయడం ఒక ఎత్తయితే.. రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాల దరిమిలా ఆ పార్టీ శాసనసభ్యులు ఇద్దరు, టీడీపీ శాసనసభ్యులు ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్సా..? కాంగ్రెస్సా..?
టీఆర్‌ఎస్ టికెట్ ఖరారు చేసేలోపే రాజకీయంగా నిర్ణయం తీసుకోవడం మేలని, దీనిపై కార్యకర్తలకు, అనుచరులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమయం సైతం అవసరం ఉన్నందున త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం సముచితమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరే అంశంపై పలు కోణాల్లో చర్చ జరిగినా..ఒక కొలిక్కి రాలేదు. టీడీపీలో సీనియర్ నాయకులు పలువురు సమావేశానికి హాజరు కాలేకపోవడంతోపాటు మరికొంతమంది నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావించిన నామా శనివారం ఖమ్మం చేరుకుని మరికొందరు ముఖ్యనేతలతో తన రాజకీయ భవితవ్యంపై తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చించాలని సంకల్పించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు టీడీపీలోని ముఖ్యనేతలకు నామా శనివారం ఖమ్మం వస్తున్నారన్న సమాచారాన్ని అందించారు. పార్టీ కార్యకర్తల నిర్ణయాన్ని అనుసరించి ఆయన రాజకీయ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment