సాక్షి, ఖమ్మం: బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ ఆర్భాటంలో.. గ్యాస్ సిలిండర్లు పేలి ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంపై చీమలపాడు గ్రామస్తుల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. తమ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ప్రమాదానికి కారకుడయ్యాడంటూ ఎంపీ నామా నాగేశ్వరరావుపై మండిపడుతున్నారు వాళ్లు. బాణాసంచా కాలుస్తూ ర్యాలీగా రావడమే కాకుండా.. ప్రమాదంతో తమకు సంబంధం లేదని ప్రకటించడంపై రగిలిపోతున్నారు.
బాణాసంచా కాల్చింది బీఆర్‌ఎస్ శ్రేణులు, నామా వర్గీయులు కాదా అని చీమలపాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారీ పేలుడుతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అంత ఉలిక్కిపడి భయాందోళలనకు గురయ్యాం. పేలుడు దాటికి ఆరుగురికి పైగా కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. నామా చెప్తున్నట్లు కాకుండా.. బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళన సభకు 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న చీమలపాడు గ్రామస్తులు నిరసనలకు దిగారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చీమలపాడు బాధితులకు పరిహారం ప్రకటించింది. ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2లక్షల ఆర్థిక సాయంతో పాటు వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు తెలిపారు. అయితే చీమలపాడు గ్రామస్తులు మాత్రం.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో తమ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అంతకుముందు.. చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉందని మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్న చోటుకి 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలింది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి వెళ్లడంతో గాయపడ్డారు. ఆ సమయంలో మేం స్టేజీ మీద ఉన్నాం. ఆరుగురు గాయపడ్డారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు వేరే ఆస్పత్రిలో ఉన్నారు. ఇద్దరు ముగ్గురికి కాళ్లు తెగాయి. ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఆస్పత్రిలో చేర్పించినవారికి చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. ఒకరికి మాత్రం సీరియస్‌గా ఉందన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలిన చెప్పాను. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం. గుడిసెలో ఉండే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిలిండర్ పేలడానికి, మా మీటింగ్‌కు సంబంధం లేదు. 200 మీటర్ల దూరంలో ఘటన జరిగింది. అలా అని తాము పట్టించుకోమని కాదు అని నామా మీడియాతో పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో సిలిండర్ పేలి ఘోర ప్రమాదం సంభవించింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములుతో పాటు పలువురు పార్టీ నేతలు చీమలపాడుకు విచ్చేశారు. పార్టీ నేతల రాక సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు బాణసంచా నిప్పురవ్వలు పడి సమీపంలోని గుడిసెలో మంటల చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు గుడిసె వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో..
గుడిసెలో ఉన్న సిలిండర్‌ను వాళ్లు గమనించలేదు. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పోలీసు వాహనాల్లోనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని నిలిపివేశారు.
మరో వైపు ఘటనపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్య నేతలకు సూచించారు.
ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన
చీమలపాడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందటం లేదని క్షతగాత్రుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో పట్టించుకునే వారు దిక్కులేరని. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ముగ్గురు చనిపోయారని, ఆలస్యం చేస్తే మరో ముగ్గురు కూడా చనిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరోవైపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్,బిజెపి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment