
పండుటాకులకు చేయూత
అన్ని అర్హతలుండి పింఛన్ జాబితాలో పేరు లేని వారి పక్షాన నిలుస్తూ ‘సాక్షి’ చేపట్టిన జనపథం కార్యక్రమం ఎంతో మందికి ‘ఆసరా’గా నిలుస్తోంది.
షాబాద్ మండలం తాళ్లపల్లిలో ‘సాక్షి జనపథం’
పాల్గొన్న ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి,
ప్రజాప్రతినిధులు, అధికారులు
అప్పటికప్పుడు పింఛన్ జాబితాలోకి 15 మంది..
చేవెళ్ల/ షాబాద్/ మొయినాబాద్ రూరల్: అన్ని అర్హతలుండి పింఛన్ జాబితాలో పేరు లేని వారి పక్షాన నిలుస్తూ ‘సాక్షి’ చేపట్టిన జనపథం కార్యక్రమం ఎంతో మందికి ‘ఆసరా’గా నిలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో పేరుతోపాటు వయసు తక్కువగా నమోదై పింఛను కోల్పోయిన వారికి జనపథంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో న్యాయం జరుగుతోంది. శని వారం షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లిలో ‘సాక్షి’ నిర్వహించిన జనపథం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి హాజరై.. జాబితాలో పేరులేకపోవడానికి గల కారణాలను తెలుసుకుని, అప్పటికప్పుడు సాంకేతిక లోపాలను సరిచేసి ఎంపీడీఓ పద్మావతి తో మాట్లాడి 15 మందిని అర్హులుగా తేల్చారు. తిరిగి పింఛన్లు పొందిన వారి లో ఎస్‌కేఎస్ (సమగ్ర కుటుంబ సర్వే) డాటాలో వయసు తక్కువగా నమోదైన వారు, సదరమ్ సర్టిఫికెట్‌లేని వారు, ఆధార్‌కార్డులో వయసు తక్కువ ఉండి నిజంగానే వయసు ఎక్కువ ఉన్నవారికి, దరఖాస్తు చేసుకోని వారు ఇలా మొత్తం 15 మందికి వచ్చేనెల నుంచి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జనపథంలో ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, ఎంపీడీఓ పద్మావతి, సర్పంచ్ ఈదుల ఈశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మద్దూరి పాండు, ఉపసర్పంచ్ నర్సింహులు, మాజీ సహకార సంఘం చైర్మన్ నర్సింహులుగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కొలన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ కృషి అభినందనీయం
- ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి
‘దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.1000 పింఛన్ పథకాన్ని ‘ఆసరా‘ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. అర్హులకే ఇవ్వాలనే లక్ష్యంతో చేస్తున్న ఈ కసరత్తులో కొందరిపేర్లు జాబితాలో లేవని అక్కడక్కడా కనిపిస్తోంది. అయితే అధికారులు కూడా అర్హులకు ఇవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తున్నా.. అందులోనూ కొందరిపేర్లు సాంకేతిక కారణాలవల్ల లేకుండాపోయాయి. అర్హులై ఉండి జాబితాలో పేర్లులేనివారికి ఇప్పించాలనే సదాశయంతో ‘సాక్షి’ దినపత్రిక జనపథం పేరుతో నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమంవల్ల చాలామందికి పింఛన్లు ఇప్పించగలిగే అవకాశం కలిగింది. అందుకు ‘సాక్షి’ చేస్తున్న కృషికి అభినందనీయం. బంగారు తెలంగాణకు సమాజంలోని అన్ని వర్గాలు, సంస్థలనుంచి ఇలాంటి సహకారమే కావాలి’.
అప్పటికప్పుడు పింఛన్ లబ్ధిదారులు వీరే
‘బిడ్డా.. నాకు ఇప్పుడు 82 ఏళ్లు. ఈ మధ్య వరకు నాకు పింఛన్‌వచ్చేది. కానీ ఇప్పుడు తీసేశారు. నేనెలా బతకాలి..’ అంటూ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డికి గోడు వెళ్లబోసుకుంది వృద్ధురాలు కావలి చంద్రమ్మ. ‘గతంలో పింఛన్ ఇచ్చేవారు.. ఇప్పుడు నీపేరు జాబితాలో లేదని’ సార్లు చెబుతున్నారంటూ వికలాంగురాలు సువర్ణ.. ఇలా సుమారు 20 పింఛన్ లబ్ధిదారుల పేర్లులేని వారు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ముందు వాపోయారు.
వీరితో పాటుగా అర్హులై ఉండి సదరమ్ క్యాంపునకు వెళ్లనివారు, పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోని అనంతరెడ్డి, రాజు, వెంకటయ్య, అంజయ్య, రాంచంద్రయ్య, నర్సింహులు, పద్మమ్మ, వెంకట్‌రెడ్డి, యాదమ్మ, వడ్డె వెంకటయ్య, కిష్టయ్య, పెంటయ్య, శంకరమ్మలకు సాంకేతికలోపాలు సరిచేసి వచ్చేనెల నుంచి పింఛన్ డబ్బులు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ పద్మావతిని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ఆదేశించారు.