మెజార్టీ ధీమాలో ఉన్న మోదీ యూపీఏ విధానాలనే అనుసరిస్తున్నారని పీవైఎల్ మాజీ అధ్యక్షుడు, న్యూడెమక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.రంగారావు విమర్శించారు.
మంచిర్యాల సిటీ : మెజార్టీ ధీమాలో ఉన్న మోదీ యూపీఏ విధానాలనే అనుసరిస్తున్నారని పీవైఎల్ మాజీ అధ్యక్షుడు, న్యూడెమక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.రంగారావు విమర్శించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ అనుబంధ సంఘం ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర ఆరవ మహాసభలు రెండో రోజు ఆదివారం మంచిర్యాల పట్టణంలో ముగిశాయి. విద్య, ఉపాధి అవకాశాలపై సభలో పలు తీర్మానాలు చేశారు. ముగింపు కార్యక్రమంలో రంగారావు మాట్లాడారు. బీజేపీ పాలనలో చెప్పుకోదగ్గ కొత్త విధానాలు ఏమీ లేవన్నారు. ఈ ప్రభుత్వాన్ని యూపీఏ-3గా అభివర్ణించారు.
సామ్రాజ్యవాద దేశాల్లో పర్యటించి దేశానికి అప్పులు, టెక్నాలజీ తెచ్చిపెట్టి అమెరికాకు ఉపగ్రహ రాష్ట్రంగా తయారు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం మోడీ అవలంబిస్తున్న విధానాలు రానున్న రోజుల్లో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొందరు పారిశ్రామికవేత్తలు మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారని, అటువంటి వారి ఆశలు త్వరలోనే కూలడం ఖాయమన్నారు. గుజరాత్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో జరిగిన మరణకాండను పక్కదారి పట్టిస్తున్న మోదీ అతిభయంకరమైన మతోన్మాది అని పేర్కొన్నారు.
పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్ మాట్లాడుతూ యువత సామాజ్రవాద విష సంస్కృతిలో కొట్టుకుపోతుందన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లు, వీకెండ్ క్లబ్‌లు యువతను నాశనం చేయడంతోపాటు సంస్కృతిని కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లాల్‌కుమార్, సక్రు పాల్గొన్నారు.