మృతుడు కృష్ణమూర్తి కృష్ణమూర్తి(ఫైల్)
చెన్నారావుపేట: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, తెలంగాణ తొలి, మలి ఉద్యమకారుడు నామాల కృష్ణమూర్తి (56) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి భోజనం చేశారు. అనంతరం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కృష్ణమూర్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య సోమక్క, కుమారులు అనిల్, మధు, శ్రీనులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర..
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణమూర్తి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ రాజకీయంలో కాంగ్రెస్ సేవాదల్ జిల్లా ఆర్గనైజర్‌గా, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విజయశాంతి ఆధ్వర్యంలో తల్లి తెలంగాణ పార్టీ తరపున మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్‌ఎస్ పార్టీలో చేరి మండల కార్యదర్శిగా కొనసాగాడు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగుతున్న మలి దశ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించాడు.
తెలంగాణ ఉద్యమంలో 2009 ఆగస్టు 27న సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా పల్లెనిద్ర కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని గురిజాల గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో రెండు రోజులు కృష్ణమూర్తి ఇంటిలో పల్లెనిద్ర చేసి గ్రామాలలో సమస్యలు తెలుసుకున్నారు. మూడు నెలల క్రితం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment